ఉమ్మడి కరీంనగర్‌లో టీచర్ల కొరత.. 2 వేలకుపైగా ఖాళీలు

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత (Teachers Shortage) తీవ్ర సమస్యగా మారింది. ఒకవైపు వరుస ఉద్యోగ విరమణలు, మరోవైపు కొత్త నియామకాల ప్రక్రియలో జాప్యం కారణంగా ప్రభుత్వ బడులలో బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ కాకపోవడం విద్యాశాఖకు సవాల్‌గా మారింది. జూన్ నెలలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకంగా 53 మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందారు. ఒకే నెలలో ఇంత పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు రిటైర్ కావడం ఉమ్మడి జిల్లా చరిత్రలోనే తొలిసారిగా నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఉన్న ఖాళీలకు మరిన్ని పోస్టులు తోడయ్యాయి. 2024లో టీఎస్‌ఆర్టీ ద్వారా కొన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినప్పటికీ.. ఆ తర్వాత ఏర్పడిన ఖాళీల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతేడాది అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినప్పటికీ.. వాటి కారణంగా ఏర్పడిన ఖాళీలను సకాలంలో భర్తీ చేయకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితి దారుణం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో బోధకుల కొరత తీవ్రస్థాయికి చేరింది. గత రెండు, మూడేళ్లుగా విద్యా వాలంటీర్ల నియామకాలు నిలిచిపోవడం, 2024 డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేసిన తర్వాత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంలో జాప్యం కారణంగా పాఠశాలల్లో బోధన ఇబ్బందికరంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాథమిక పాఠశాలలు ప్రస్తుతం ఏకోపాధ్యాయ పాఠశాలలుగా కొనసాగుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు బహుళ తరగతులను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. గంగాధర మండలం నారాయణపూర్ ప్రాథమిక పాఠశాలలో ఒకే గదిలో ఐదు తరగతుల విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం ఉపాధ్యాయులకు సవాల్‌గా మారింది.

పర్యవేక్షణపైనా ప్రభావం

పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు చూసే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల (GHM) పోస్టులు కూడా ఖాళీగా ఉండటంతో సమస్య మరింత తీవ్రమైంది. పలువురు హెచ్‌ఎంలను ఇన్‌ఛార్జ్ ఎంఈఓలుగా నియమించడంతో పాఠశాలల పర్యవేక్షణపై ప్రభావం పడుతోంది. ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, విద్యా ప్రమాణాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలను సత్వరమే భర్తీ చేసి పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

రిటైర్ అవుతున్న టీచర్లకు ప్రశంసాపత్రాలు

మరోవైపు ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయుల సేవలను రాష్ట్ర విద్యాశాఖ గుర్తిస్తోంది. విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు వారి మేధస్సును తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల సేవలను ప్రశంసిస్తూ విద్యాశాఖ ప్రశంసాపత్రాలను అందిస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ పంపిన ప్రశంసాపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారులు ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు అందజేస్తున్నారు. అయితే మరోవైపు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అవుతుండటంతో ఖాళీల భర్తీపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఉమ్మడి జిల్లా డేటా
  • మొత్తం ప్రభుత్వ పాఠశాలలు: 2,465
  • మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు: 12,098
  • ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు: 10,092
  • మొత్తం ఖాళీలు: 2,006
జిల్లాల వారీగా ఖాళీలు
  • కరీంనగర్: 508
  • పెద్దపల్లి: 428
  • రాజన్న సిరిసిల్ల:  417
  • జగిత్యాల: 653

మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  2,006 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని సత్వరమే భర్తీ చేయకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మరింత ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఖాళీల భర్తీకి విద్యాశాఖ పక్కా కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>