కలం, వరంగల్ బ్యూరో : మిర్చి తొడిమెలను (Chilli Waste) కాల్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు (MLA Nagaraju) హెచ్చరించారు. శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంత్రి సురేఖ (Konda Surekha) తో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిర్చి తొడిమెలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అవసరమైతే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఈ తొడిమెలను డంపింగ్ యార్డులకు తరలించే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏనుమాముల పోలీస్ స్టేషన్‌కు కొత్త భవనం మంజూరు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రైతును రాజుగా నిలపడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఐనవోలు, దామెర మండలాలలో అధికంగా పంట దిగుబడి వచ్చిందని, కొనుగోలు కేంద్రాలను నిరంతరం సందర్శిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం, మక్కలను కొనుగోలు చేస్తోందని, అకాల వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వారు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే (MLA Nagaraju) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణ టెంపుల్ టూరిజం : మన గుడులు.. మన సంస్కృతి
Follow Us On : WhatsApp

