Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి (MLA Madhusudan Reddy) తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశానికి ఆయన (MLA Madhusudan Reddy ) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే “ప్రజల వద్దకే పాలన” అనే లక్ష్యంతో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ద్వారా ఒక మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలు, పట్టణాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన వారికి పారదర్శకంగా ఫలాలు అందిస్తున్నారని  చెప్పారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం పెరిగిందని అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల ప్రతి కుటుంబానికి నెలకు సుమారు రూ.1,136 ఆదా అవుతోందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా ద్వారా రుణమాఫీ, రైతు బీమా కింద రైతు మరణిస్తే కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతంగా అమలవుతోందని, ప్రతి గ్రామంలో కనీసం 10 నుంచి 15 మంది పేదలు ఇళ్లు నిర్మించుకుంటున్నారని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి మండలం, నియోజకవర్గ స్థాయిలో 50 పడకల, 100 పడకల ఆసుపత్రులను నిర్మిస్తున్నామని వెల్లడించారు. విద్యా రంగంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ క్లాసులు, డిజిటల్ బోర్డులు, ఆన్‌లైన్ తరగతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందించే పథకాన్ని కూడా ప్రభుత్వం జూన్ 12 నుండి అమలు పర్చేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో “బడిబాట” కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజక వర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభిస్తోందని తెలిపారు.
జూన్ 2 తర్వాత ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలను తీసుకురానుందని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇన్సూరెన్స్ పథకాలు త్వరలో అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజీలు అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలు ప్రభుత్వం చేపడుతోందన్నారు. పోలీస్ శాఖ రాష్ట్రంలో శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం అవసరమన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసై అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.

రైతులు పండించే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పారిశుధ్యం, వైద్యం, విద్య, వ్యవసాయం, ఇరిగేషన్, యువజన సంక్షేమం, క్రీడలు, పర్యాటకం, పర్యావరణం, రోడ్డు భద్రత, రైతు సంక్షేమం వంటి అనేక అంశాలపై ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు చేరవేసి, అర్హులైన వారికి ఫలాలు అందించే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సరైన పర్యవేక్షణ, సమర్థవంతమైన అమలు ఉంటేనే సంక్షేమ పథకాల అసలు ప్రయోజనం పేదలకు అందుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి. జానకి, మేయర్ గుమ్మాల మమత, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బి. అనిత మధుసూదన్ రెడ్డి, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాల్‌కోటి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీఆర్వో రామ్‌రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

స్టాళ్ల ప్రదర్శన..

సమావేశానికి ముందు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో వైద్య ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, ఉద్యానవన శాఖల ద్వారా ఏర్పాటుచేసిన ప్రత్యేక స్టాళ్లను సందర్శించి ప్రారంభించారు. ఈ స్టాళ్ల ద్వారా ఆయా శాఖలు అమలుపరుస్తున్న వివిధ పథకాలు గురించి, ప్రభుత్వం అందిస్తున్న సేవలు, సబ్సిడీ పరికరాల గురించి ప్రదర్శించారు. అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి స్టాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>