కలం, వెబ్ డెస్క్ : పోక్సో కేసు నిందితుడిని తొమ్మిది రోజుల పాటు దాచి ఉంచిన నేరం ముమ్మాటికి హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం వల్లే రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని బయటకు వస్తే, ఆ కుటుంబాన్ని బెదిరించి కౌంటర్ కేసు పెట్టించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని తొమ్మిది రోజులు కాపాడింది ముమ్మాటికి రాష్ట్ర ముఖ్యమంత్రేనని స్పష్టం చేశారు. మైనర్ బాలిక తనకు జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, అర్ధరాత్రి వరకు నిలబెట్టి తీవ్ర ఆవేదనకు గురిచేసింది ఈ ప్రభుత్వమేనని ప్రశ్నించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి కలిసి తొమ్మిది రోజుల పాటు నిందితుణ్ణి కాపాడారని ఆరోపించారు. హైకోర్టు బెయిల్ ఇవ్వనని తెగేసి చెప్పడం, తెలంగాణలోని ఆడబిడ్డలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడంతోనే సిగ్గు తెచ్చుకొని, చివరికి దిక్కులేని పరిస్థితుల్లో నిందితున్ని అరెస్ట్ చేశారన్నారు.
అడ్డగోలు సాకులు చెప్పడం సిగ్గుచేటు..
రాష్ట్ర హోంశాఖకు బాధ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి, ప్రధాని పర్యటన వల్ల పోలీసులంతా బిజీగా ఉన్నారంటూ అడ్డగోలు సాకులు చెప్పడం సిగ్గుచేటని కేటీఆర్ అన్నారు. ప్రధానమంత్రి వస్తే రేవంత్ రెడ్డి చంచల్‌గూడ సన్నిహితులు బయట అడ్డగోలుగా నేరాలు చేయవచ్చా అని ప్రశ్నించారు. అత్యంత సున్నితమైన బాలిక విషయంలో పార్టీ తరఫున తాము మౌనంగా ఉన్నామని, ఏనాడూ రాజకీయం చేయలేదని తెలిపారు. సీఎం తమపై విమర్శలు చేసిన తర్వాతనే తప్పని పరిస్థితుల్లో ఈ అంశంపై మాట్లాడాల్సి వస్తున్నదని వివరించారు. దేశంలో ఎక్కడైనా పోక్సో కేసు నిందితుడిని తొమ్మిది రోజులు దాచిపెట్టిన సందర్భం ఉన్నదా అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సన్నిహితుడి ఆసుపత్రిలో తొమ్మిది రోజుల పాటు నిందితుడిని దాచిపెట్టారన్న వార్తలపై ప్రభుత్వం విచారణ జరపాలన్నారు.
కౌంటర్ కేసు పెట్టించిన వెధవ ఎవరో చెప్పాలి..
ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని బయటకు వస్తే ఆ అమ్మాయి కుటుంబంపైనే ‘హనీ ట్రాప్’ అంటూ కౌంటర్ కేసు పెట్టించి కుట్ర చేయించిన వెధవ ఎవరో చెప్పాలని బండి సంజయ్‌కి, ముఖ్యమంత్రికి సవాలు విసిరారు. బండి సంజయ్ కొడుకు తనకు సంబంధం లేదని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నాడని, అంతటి దుర్మార్గమైన పరిస్థితి ఏ తండ్రికి రావద్దన్నారు. ఒకవైపు తన కొడుకుకు సంబంధం లేదని చెప్తూనే, తిరిగి తానే పోలీసులకు అప్పజెప్పానని అనడంపై సమాధానం చెప్పాలన్నారు. కేంద్రమంత్రి కొడుకు కావడం, ముఖ్యమంత్రి అండదండలు ఉండడం వల్లే నిందితుడు తప్పించుకున్నాడని విమర్శించారు. ఇది చూసిన తర్వాత రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ కూడా బలవంతులపై ఫిర్యాదు చేయడానికి వెనకాడే పరిస్థితి నెలకొందన్నారు.
ఈ మొత్తం కేసులో పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అద్భుతంగా ప్రభుత్వాన్ని, మీడియాను అలర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారని అభినందించారు. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మాటల్ని ఖండించారు. రేవంత్ రెడ్డి లాంటి దొంగే, దొంగలను ఎలా పట్టుకోవాలో పోలీసులకు క్లాస్ పీకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కేసు విషయంలో హనీ ట్రాప్ అంటూ అడ్డగోలు వార్తలు రాయించిన వ్యక్తులు ఎవరో సమాధానం చెప్పాలన్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు మీడియా కార్యాలయాలకు ఫోన్ చేసి కాళ్లా వేళ్లా పట్టుకొని వార్తలు రాకుండా ఆపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. లగచర్ల నుంచి మొదలుకొని రాష్ట్రంలో ఎక్కడ ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా తమ పార్టీ తరఫున ఎల్లప్పుడూ కొట్లాడుతామని కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు.

