మీకు నిధులు, మాకు బాధలా? మంత్రులూ.. ఖమ్మం ఏజెన్సీకి నిధులేవి!

కలం, ఖమ్మం బ్యూరో: ‘మీకు నిధులు, మాకు బాధలా మంత్రివర్యా’.. అని ఉమ్మడి ఖమ్మం ప్రజలు తమ గోడును వినిపిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 ఉండగా, ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా మధిరకు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే పాలేరుకు పొంగులేటి, ఖమ్మంకు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వీరు ముగ్గురు ఖమ్మం జిల్లా నుంచి మంత్రులుగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినప్పటికీ నిధులన్నీ ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయనీ ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇదే భావన కొత్తగూడెం జిల్లా ప్రజల్లో కూడా ఉన్నట్లు ఎమ్మెల్యే కునంనేని (MLA Kunamneni) వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధిర, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాలు వెనకబడి ఉన్నాయని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భద్రాచలానికి ఇటీవలనే ప్రభుత్వం రూ.351 కోట్ల నిధులు మంజూరుచేసింది. కానీ ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గాన్ని మంత్రులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఇటీవల కార్పొరేషన్‌గా ఏర్పడినప్పటికీ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. నిధుల కోసం పట్టుబడినా మంజూరుకావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

మధిర నియోజకవర్గానికి రహదారుల అభివృద్ధి కోసం రూ.596 కోట్ల నిధులు మంజూరయ్యాయి. జవహర్ ఎత్తి పోతల పథకం కోసం రూ.630 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే రాయపట్నం, మహాదేవ పురం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే మధిరను మోడల్ మున్సిపాలిటీ‌గా మార్చే ప్రయత్నాలతోపాటు ఇతర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక పాలేరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మున్నేరు పాలేరు లింక్ స్కీమ్ వంటి పలు అభివృద్ధి పనులకు రూ.600 కోట్లు మంజూరయ్యాయి. వీటితోపాటు ఖమ్మం నియోజకవర్గంలో కూడా మున్నేరు కేబుల్ బ్రిడ్జి, మున్నేరు వరద రక్షణ గోడ, ఇతర అభివృద్ధి కోసం దాదాపు రూ. 1000 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి.

అయితే ఈ మూడు నియోజకవర్గాల అభివృద్ధితో పోలిస్తే, కొత్తగూడెం జిల్లాకు చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ఏది రాకపోవడం, పినపాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలను కలిసి నియోజకవర్గ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాడు. పినపాకలో ఏడు మండలాలతోపాటు సుమారు 3 లక్షల జనాభా ఉంది. అయినప్పటికీ ఒక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మంజూరు కాలేదు. అలాగే బైపాస్ రోడ్డు, రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అంతర్గత రోడ్లు, శాశ్వత భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు. మొత్తంగా ఖమ్మం జిల్లా అభివృద్ధితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై కూడా మంత్రులు దృష్టి సారించాలని కోరుతున్నారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఏజెన్సీ ప్రాంతాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏజెన్సీ ప్రజలు వేడుకుంటున్నారు.

Read Also: ఫ్యూచర్ సిటీ కార్యాలయం త్వరగా పూర్తి చేయాలి.. సీఎం రేవంత్ ఆదేశం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>