కలం, నల్లగొండ బ్యూరో: రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి, వారిని ఆర్థికంగా ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar Reddy) అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని పహిల్వాన్‌పురం, మాందాపురం, నాతాళ్ళగూడెం, అక్కంపల్లి, లింగరాజుపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అదనపు ప్రోత్సాహం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం వడ్లపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించిందని తెలిపారు. గత ఏడాది నియోజకవర్గంలో 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. ఈ ఏడాది దానిని 4.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
అధికారులకు కఠిన ఆదేశాలు
కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగనివ్వద్దని ఎమ్మెల్యే ఆదేశించారు. కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు (గోనె సంచులు), తూకం యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు (తేమ కొలిచే పరికరాలు) సరిపడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వంటి కనీస సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ధాన్యం సేకరణలో ఆలస్యం లేకుండా వెంటనే తూకం వేసి, సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా ఆదేశించారు. రైతు నుంచి వచ్చే చిన్న ఫిర్యాదునైనా వెంటనే పరిష్కరించాలని, తేమ శాతం పరీక్షల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే (MLA Kumbam) స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, ఐకేపీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Read Also: మరికాసేపట్లో కేసీఆర్, రేవంత్ స్పీచ్.. ఒకటే ఉత్కంఠ!
Follow Us On: X(Twitter)

