కలం, వరంగల్ బ్యూరో: వర్ధన్నపేటలో దొర అహంకారంతో కేటీఆర్ (KTR) ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. గతంలో ఎటువంటి అభిప్రాయ సేకరణ లేకుండా తండాలను మున్సిపాలిటీలో కలిపి .. ఇప్పుడు వారే విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు (KR Nagaraju) విమర్శించారు. వర్ధన్నపేట (Wardhannapet) మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏ వార్డులో అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించారో అ వార్డులో మేము ఓట్లు అడగమని, దళిత బందు 10 లక్షలు ఇస్తామని చెప్పారని, ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
ప్రజా పాలనను కొనసాగిస్తూ పేదలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. తాను 35 సంవత్సరాలు పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించానని, పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు ఏం చేశారో మొత్తం నాకు తెలుసు అని ఎమ్మెల్యే అన్నారు. పదేళ్ల మీ పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలి తప్ప సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోమని, సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ని ఉద్దేశించి మాట్లాడే స్థాయి కేటీఆర్(KTR) ది కాదని ఎమ్మెల్యే మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని తండాల అంశంపై తాను అసెంబ్లీలో మాట్లాడానని, రాబోయే మూడేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.


