Mobile Popup Ad
Mobile Popup Ad

సాగర్ సాక్షిగా.. ప్రదీప్ కనస్ట్రక్షన్స్ కు షాక్!

కలం, తెలంగాణ బ్యూరో: హుస్సేన్ సాగర్ సమీపంలో 17 అంతస్తులతో ప్రదీప్ కనస్ట్రక్షన్స్ (Pradeep Constructions) కంపెనీ నిర్మిస్తున్న భవనానికి జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం ఆ కంపెనీ చేసుకున్న దరఖాస్తు ఇంకా పరిశీలనలోనే ఉన్నదని, అనుమతి మంజూరు కాలేదని ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే నిర్మాణం జరుగుతున్నందున లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయాలంటే ‘రెరా’ రిజిస్ట్రేషన్ తప్పనిసరి నిబంధన. కానీ ఆ అనుమతి జనవరిలోనే ముగిసిపోయింది. కాగా, ఈ నిర్మాణాన్ని హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో కడుతున్నారంటూ ఇరిగేషన్ శాఖ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారమే పరిశీలించారు.

తెలంగాణ ‘రెరా’ (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) విడిగా మరో ప్రకటన జారీచేసింది. ఈ కంపెనీకి 2020 మార్చి 21న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని, నిబంధనల ప్రకారం ఈ ఏడాది జనవరి 2న రెన్యూవల్ చేసుకోవాల్సి ఉన్నదని కానీ ఆ ప్రక్రియ జరగలేదని అడ్వయిజరీ జారీ చేసింది. రెన్యూవల్ జరగనందున ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ గడువు ముగిసినట్లయిందని, వినియోగదారులెవరూ క్రయ విక్రయాలు జరపొద్దని సూచించింది.

ఆ కంపెనీ సైతం ప్రచారం చేసుకోవడం, పబ్లిసిటీ కార్యకలాపాలు చేయకూడదని స్పష్టం చేసింది. ప్రకటనలు విడుదల చేయడం, మార్కెటింగ్ చేయడం, విక్రయించడం, విక్రయానికి ప్రతిపాదనలు పెట్టడం.. ఇలాంటివేవీ చేయొద్దని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ గడువు ముగిసినందున ఆ కంపెనీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి చట్టబద్ధమైన ప్రచారం చేయడం లేదా ప్రయోజనాలను పొందడం వద్దని స్పష్టం చేసింది.

వాణిజ్య ప్రకటనల్లోనూ ‘రిజస్టర్డ్ ప్రాజెక్టు’ అని చూపడానికి వీల్లేదని పేర్కొన్నది. హెచ్ఎండీఏ సైతం 2018 జూన్ 21న జారీచేసిన అనుమతిలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (హెచ్ఎండీఏ కోర్ ఏరియా) మాస్టర్ ప్లాన్ మేరకు షరతులతో కూడిన పర్మిషన్ ఇస్తున్నట్లు పేర్కొన్నది. ఒక్కో ప్లాట్‌కు నాలుగువైపులా ఎంత స్థలాన్ని విడిచిపెట్టాలో నిర్దేశించడంతో పాటు వాటర్ బాడీస్ గురించి రెవెన్యూ రికార్డుల ప్రకారం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>