కలం మెదక్ బ్యూరో: ప్రజలకు ఉపాధి లభిస్తుందన్న ఆశతో పరిశ్రమల స్థాపనకు భూములిస్తే నేడు అవే పరిశ్రమలు ప్రజల ప్రాణాలు తీస్తూ కాలకూట విషాన్ని వెదజల్లుతున్నాయని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) అన్నారు. పరిశ్రమలు తీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. జిన్నారం మండలం గడ్డ పోతారం (Gaddapotharam) అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కట్టపైనే పీసీబీ, నీటి పారుదల శాఖ అధికారులు, మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో చర్చించారు.
సమావేశం అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) మాట్లాడుతూ.. గడ్డపోతారం పరిధిలో పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘిస్తూ స్థానిక చెరువులను తమ రసాయన జలాలతో కాలుష్యం చేస్తున్నాయని తెలిపారు. పరిశ్రమల తీరుతో ప్రకృతి విధ్వంసం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు అయ్యమ్మ చెరువుల్లోకి కాలుష్య జలాలు వదలడం మూలంగా స్థానికంగా వ్యవసాయ రంగం పూర్తిగా విధ్వంసం కావడంతో పాటు పశుపక్షాదులు సైతం ప్రాణాలు కోల్పోతున్నాయని తెలిపారు. మహిళలకు వివిధ రకాల క్యాన్సర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కాలుష్య జలాలను వదులుతున్న పరిశ్రమలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రజల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని, అవసరమైతే కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను తరిమికొడతామని హెచ్చరించారు.
Read Also: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బిగ్ షాక్
Follow Us On: Instagram

