కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) తెలిపారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వాసిత రైతులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడితో కలిసి రైతుల సమస్యలను విన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Anirudh Reddy) మాట్లాడుతూ.. కోర్టు కేసుల కారణంగా పరిహారం పొందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటివరకు 90 నుంచి 95 శాతం నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాస ప్యాకేజీలు అందించామన్నారు. మిగిలిన అర్హుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు నిర్వాసితులు గత ప్రభుత్వం తమకు సరైన పరిహారం చెల్లించలేదని, పరిహారం మొత్తాన్ని పెంచాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే.. అర్హులైన ప్రతి రైతు సమస్య పరిశీలించి పెండింగ్ పరిహారాలను విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఏడాదిన్నరలో నీరు నిల్వ చేస్తాం..
ఉదండాపూర్ రిజర్వాయర్‌లో మిగిలిన పనులు పూర్తి చేసి, రానున్న ఏడాదిన్నర కాలంలో రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తికి రైతులు సహకరించాలని కోరారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించి, అర్హులైన వారికి పరిహారం అందజేస్తామని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు మాట్లాడుతూ.. ఇటీవల సోమశిలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు పెండింగ్ కేసులను మానవతా దృక్పథంతో పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిహారం అందజేస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, ఆర్డీవో నవీన్, సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: కరీంనగర్‌లో మంత్రుల సవాల్.. ‘టెండర్లలో అవినీతి నిరూపిస్తారా?’
Follow Us On: Instagram

