కలం, భువనగిరి : గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్ని వ్యవస్థలను ప్రజా ప్రభుత్వం తిరిగి గాడిలో పెడుతోందని భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Anil kumar) పేర్కొన్నారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా శుక్రవారం భువనగిరి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలనలో భాగంగా ప్రతి వారం ఒక్కో శాఖపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహిస్తూ, లోటుపాట్లను సరిదిద్దుకుంటూ అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే, పేదల కలలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్, పేపర్ లీకేజీలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అరాచకాలు జరిగాయని ఆయన విమర్శించారు. భువనగిరి జిల్లాలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామని, తన ఎమ్మెల్యే నిధులను సైతం విద్య, వైద్య రంగాలకే కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం ప్రభుత్వం రూ.4,500 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. భువనగిరి జిల్లా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఆధునికీకరిస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల 20 ఏళ్ల నాటి కల అయిన జూలూరు – రుద్రవెల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ.18.5 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. మూసి నది మధ్యలో ఉన్న చారిత్రాత్మక భీమలింగేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ, ప్రగతికి ఆధ్యాత్మికతను జోడిస్తున్నామని పేర్కొన్నారు.
సర్పంచుల సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే జూన్ 2 నుంచి పెన్షన్లు, అలాగే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ విజయం సాధిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు అత్యంత చేరువలో ఉన్న భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే జిల్లాకు ఐటీ సంస్థలను తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి, భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

