epaper
Wednesday, February 18, 2026
epaper

BRS కు మరోసారి అధికారం కలేనా?.. కేటీఆర్ కామెంట్లతో కేడర్ కన్‌ఫ్యూజ్

కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తాజా కామెంట్లు ఆ పార్టీ కేడర్‌ను కన్‌ఫ్యూజన్‌లో ముంచెత్తాయి. “రెండేండ్ల తర్వాత అధికారం మాదే.. కాంగ్రెస్ కథ ముగిసింది.. రెండేండ్లలో ఆ పార్టీ చేసిందేమీ లేదు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ పతనం స్టార్ట్.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఇప్పుడు ఆగిపోయిన అభివృద్ధి పనులన్నింటినీ అప్పుడు పూర్తి చేస్తాం..” ఇవీ నిన్నమొన్నటి దాకా కేటీఆర్ (KTR) చేసిన గంభీర ప్రకటనలు. కానీ తొర్రూర్‌లో ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో మాత్రం ఇందుకు భిన్నమైన కామెంట్లు చేశారు. అధికారంలోకి వస్తామో.. రామో… అనే సందేహంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. దీంతో నిన్నటిదాకా ఉత్సాహంతో ఉన్న కేడర్ తాజా వ్యాఖ్యలతో గందరగోళంలో పడ్డారు.

తప్పిదారి అధికారంలోకి వస్తే… :

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొర్రూర్‌లో (Thorrur) జరిగిన ర్యాలీలో కేటీఆర్ చేసిన మాటల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గడం పార్టీ కేడర్‌లోనే సరికొత్త చర్చకు దారితీసింది. సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రసంగిస్తూ… “పొట్టోడికి మాత్రం ఒకటే చెప్తున్న నేను.. మొక్కుకో.. ఎన్ని దేవుళ్ళంటే అన్ని దేవుళ్ళకు మొక్కుకో.. ‘తప్పిదారి’ మళ్ళీ గులాబీ జెండా గెలిచిందనుకో… నీకుంటది…” అని వ్యాఖ్యానించారు. “రెండేండ్ల తర్వాత మళ్లీ వచ్చేది మా పార్టేయే…” అంటూ నిన్నటిదాకా ధీమాతో వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ (KTR).. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడానికి ఒక రోజు ముందు ఈ కామెంట్లు చేయడం గమనార్హం. ‘తప్పిదారి’ అని ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చిందనేది అర్థం కాక శ్రేణులు అయోమయంలో పడ్డాయి. పార్టీ కచ్చితంగా గెలుస్తుంది.. మళ్లీ అధికారంలోకి వస్తుంది… అనే మాటలకు బదులు అనుమానంతో కూడిన కామెంట్ చేయడం సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనన్నది వారి భావన.

ఆత్మవిశ్వాసం స్థానంలో అనుమానం :

బాన్సువాడ, బిచ్‌కుందలో శనివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగిందని, రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎలాగూ కాంగ్రెస్‌కు నెగెటివ్ తీర్పు ఇవ్వబోతున్నారు.. ఆ తీర్పుతో కాంగ్రెస్ పతనం ప్రారంభమవుతుంది… మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం….” అని అన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో సిరిసిల్లలో జరిగిన రోడ్ షో లలో “నేతన్నల శాపం ఈ ప్రభుత్వానికి తగులుతుంది.. తాత్కాలిక చీకటి ఇంకా మనకు రెండేండ్లే.. గులాబీ జెండా ఎగరడం ఖాయం…” అని అన్నారు. ఇంతగా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసి ప్రజల్లో స్పష్టమైన మెసేజ్ ఇచ్చిన కేటీఆర్ తొర్రూర్ సభలో ‘తప్పిదారి’ అంటూ మాట్లాడడం మనసులోని భావాన్ని వ్యక్తం చేయడమా?.. లేక పొరపాటున నోరుజారి అన్నారా?.. లేక వాస్తవ పరిస్థితి ఇలా మాటల్లో వచ్చేసిందా?.. ఇలాంటి చర్చలు కేడర్‌లో మొదలయ్యాయి.

హరీశ్‌రావు సైతం ‘రెండేండ్ల’ కామెంట్ :

హరీశ్‌రావు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఉండేది రెండేండ్లే.. ఆ తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే… మళ్ళీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం.. అంటూ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన కామెంట్లు చేశారు. తూప్రాన్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి పాలనలో రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చే దిక్కు లేదు.. కేసీఆర్ హయాంలో ఈ గ్రామం ఎలా మారిపోయిందో మీకు తెలుసు… రెండేళ్లుగా ఇక్కడి ప్రజలు కాంగ్రస్ అరాచకలాను భరించారు. ఇంకో రెండేండ్లు ఒపిక పదితే మళ్లీ మనదే అధికారం.. అప్పుడు తూప్రాన్ బాధ్యతను నేనే తీసుకుంటా…” అని హామీ ఇచ్చారు. హరీశ్‌రావు చాలా ధీమాతో పై కామెంట్లు చేస్తే కేటీఆర్ మాత్రం ‘తప్పిదారి’ అని వ్యాఖ్యానించడంతో పార్టీలో ఏం జరుగుతోంది?.. ఎవరికి వారే.. చందంగా మారిపోయిందా?.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే ఆత్మవిశ్వాసాన్ని వదలేసుకుంటే..” అనే అనుమానాలు మొదలయ్యాయి.

Read Also: మున్సిపోల్స్.. కుంభస్థలంపై కాంగ్రెస్ ఫోకస్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>