కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) హడావుడి ముగింపు దశకు చేరుకుంటోంది. నేటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. ఆయా పార్టీల నాయకులు తమ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడుతున్నారు. చివరి రోజు సైతం రాష్ట్రంలో అన్ని పార్టీల నాయకుల మెరుపు పర్యటనలున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నేడు సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో అన్ని స్థానాల్లో అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇక ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కానుకల రూపంలో డబ్బు, మద్యంతో పాటు పలు వస్తువులను కూడా సమర్పించుకుంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల పలు పార్టీలకు చెందిన వ్యక్తులు డబ్బు, మద్యంతో పట్టుబడ్డారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడ్డాయి.
ఇక పార్టీల వారీగా చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, పీసీసీ నేతలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి మెదక్ సభ రద్దయ్యింది. మంత్రులు యథావిధిగా చివరి రోజు ప్రచారాల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్ రావు, మాజీ మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా, కొన్నిచోట్ల బీఆర్ఎస్ నేతలకు ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గతంలో గెలిపించినప్పుడు ఏం అభివృద్ధి చేశారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర నాయకులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీ ఎత్తున పోటీలో ఉన్నారు. వారు సైతం విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.
జనవరి 27న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మొత్తం 2,996 వార్డుల స్థానాలకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరకు పోలింగ్ జరుగనుంది. అలాగే 13న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.


