కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ ఫైర్ బ్రాండ్స్‌గా చెప్పుకునే మహిళా మంత్రులు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అప్పట్లో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెను దుమారం లేపింది. మంత్రి మాటలపై స్పందించిన కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా కేసు పెట్టారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో మంత్రి సీతక్క (Seethakka) అంగన్వాడీ సెల్ ఫోన్‌ల కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ (BRS) నేతలు సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)ను బాధ్యుడిని చేస్తూ లీగల్ నోటీస్ పంపించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.
సెల్ ఫోన్ తెచ్చిన లొల్లి…
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపరచడంలో భాగంగా టీచర్లకు మొబైల్ ఫోన్‌లు అందజేశారు. అయితే ఫోన్‌ల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలకు దిగారు. అక్రమాలకు ఆ శాఖ మంత్రి సీతక్క (Seethakka) కారణమంటూ విమర్శలు గుప్పించారు. దీంతో మనస్తాపానికి గురైన మంత్రి బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు లీగల్ నోటీసు జారీ చేశారు. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్‌ల కొనుగోలుతో తనకు సంబంధం లేదని సీతక్క పేర్కొన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యులని పేర్కొన్నారు. 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని సీతక్క హెచ్చరించారు.
కేటీఆర్‌తో కొండా సురేఖ వైరం
కొద్దిరోజుల కిందట మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై (KTR) అనుచిత వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆరే కారణమని, ఆయన వల్లే మరికొందరు హీరోయిన్లు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర వ్యతిరేకతకు గురయ్యాయి. సురేఖ సమంత విషయంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ, కేటీఆర్‌పై చేసిన ఆరోపణలను మాత్రం వెనక్కి తీసుకోలేదు. దీంతో కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సురేఖ తన కుటుంబం గురించి చేసిన వ్యాఖ్యలు తన పరువు తీసేలా ఉన్నాయని, ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సైతం రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయడం చర్చనీయాంశంగా మారింది. తనపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ తర్వాత కొండా సురేఖ సొంత పార్టీ నేతలతోనే వైరం పెటుకున్నారు. మేడారం జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు చేశారు. అంతేకాకుండా తన ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో కూతురు జోక్యం చేసుకోవడం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే పరిస్థితికి వెళ్లింది. ఇప్పుడు మంత్రి సీతక్క వ్యవహారంతో అప్పట్లో మరో మంత్రి కొండా సురేఖ, కేటీఆర్‌ల మధ్య పంచాయితీపై జిల్లా వాసులు, పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
Follow Us On: X(Twitter)

