కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala) హెచ్చరించారు. ప్రభుత్వ ఖాళీస్థలాల్లో గుడిసెలు వేద్దామని ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అధికార పార్టీ నేతలను కూడా ఉపేక్షించొద్దని ఆదేశించారు. రోడ్డు విస్తరణలో ఎక్కడైనా భవనాలు కోల్పోతే వారికి పది రెట్లు పరిహారం అందిస్తామన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం 4వ డివిజన్ బాలాజీనగర్‌లో రూ. 2 కోట్ల 43 లక్షలతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితోకలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల పట్ల సిబ్బంది ప్రేమ ఆప్యాయతలతో ప్రవర్తించాలని కోరారు.
పచ్చని మొక్కలు పెంచాలి
ఆసుపత్రి పరిసరాలలో పచ్చని మొక్కలు పెంచాలని, ఆసుపత్రి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తుమ్మల (Minister Tummala) అన్నారు. వైద్య శాఖకు ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు అవసరమైన మేర కలెక్టర్, కమీషనర్ నుంచి నిధులు తీసుకొని ఆసుపత్రి చుట్టు పక్కల పరిశుభ్రత, పారిశుధ్యం పాటించాలని అన్నారు. ఆసుపత్రి అవసరాలకు అవసరమైతే ప్రజా ప్రతినిధులు, మంత్రుల నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సిబ్బందినీ ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్ నందు వైద్య సేవలు కోసం కేటాయించాలని, అవసరమైన నూతన పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు పంపితే మంజూరు చేయిస్తానని తెలిపారు.
మంచి విద్య, వైద్య అవకాశాలతో ఖమ్మం ప్రశాంత నగరంగా అభివృద్ధి చెందాలని , విద్య, వైద్య రంగాలను రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇప్పటికే 2 వేల 200 ఇందిరమ్మ ఇళ్లను ఖమ్మం నగరంలో అర్హులైన పేదలకు ఇచ్చామని త్వరలో మరో 2 వేల 500 ఇండ్లు మంజూరుకి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వీలైనంత వరకు పేద ప్రజల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. 13 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తుందని, పేదలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. గతంలో తాన మంత్రిగా ఉన్నప్పుడు 6000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశానని, వాటిలో పెండింగ్ నిర్మాణాలను కూడా పూర్తి చేసి, రోడ్డు విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలలో నిర్వాసితులకు కేటాయించేలా చర్యలు చేపట్టామన్నారు.


