కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క (Minister Seethakka) లీగల్ నోటీసులు పంపించారు. తన మీద బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడుతున్నారు. ఇటీవల మంత్రి సీతక్క మీద బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్ల కొనుగోలులో స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులు పెట్టారు. ఈ ఆరోపణలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎటువంటి స్కామ్ జరగలేదని తేల్చి చెప్పారు. తన మీద తప్పుడు ఆరోపణలు చేసిన వారిని చెప్పుతో కొడతానంటూ కూడా ఆమె హెచ్చరించారు. తాజాగా ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కే నోటీసులు పంపించారు. రిజిస్టర్ పోస్టు ద్వారా కేసీఆర్‌కు సీతక్క తరఫు అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ లీగల్ నోటీస్ పంపించారు. మరి ఈ నోటీసుల పట్ల కేసీఆర్ ఎలా స్పందిస్తారు? ఆ పోస్టులు తొలగించాలని పార్టీ సోషల్ మీడియాను ఆదేశిస్తారా? అన్నది వేచి చూడాలి.
ఆ ఆరోపణలు సరికాదు..
అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగిందని సీతక్క క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని నోటీసులో మంత్రి సీతక్క (Minister Seethakka) స్పష్టం చేశారు. ‘మొత్తం టెండర్ విలువ రూ. 44 కోట్లే ఉన్నప్పటికీ, అందులో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం అసంబద్ధం, ఆధారాలు లేని ఆరోపణ‘ అంటూ సీతక్క పేర్కొన్నారు. BRS Party అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని సీతక్క డిమాండ్ చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్న మంత్రి సీతక్క.. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కోరారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
Read Also: సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్.. అడ్వకేట్‌కు ఆల్కహాల్ టెస్ట్
Follow Us On: X(Twitter)

