కలం, వరంగల్ బ్యూరో: మేడారం మహాజాతర –2026 కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రవాణా, మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నది. శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) మేడారాన్ని సందర్శించి తాత్కాలిక ఆర్టీసీ బస్టాండును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేడారం జాతరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 4,000 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని చెప్పారు. అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు కూడా పెంచుతామని చెప్పారు. ఇందుకోసం రవాణాశాఖ తరఫను వందలాది మంది అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
ప్రయాణ సేవలు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రయాణికులకు రవాణా సేవలతోపాటు భద్రత, ఆరోగ్య సహాయం చేస్తామని చెప్పారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు జాతర విజయవంతానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భక్తులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులనే వినియోగించాలని మంతమంత్రి పొన్నం (Minister Ponnam) విజ్ఞప్తి చేశారు. సొంత వాహనాలతో వస్తే దూరంగా పార్కింగ్, ఎక్కువ నడక వంటి ఇబ్బందులు తప్పవని చెప్పారు. ఆర్టీసీ బస్సులు ప్రయాణికులను గద్దెలకు సమీపంలోనే దించుతాయని తెలిపారు.
భక్తులంతా ఆర్టీసీ బస్సులోనే రావాలని సూచించారు. జాతర సమయంలో చిన్న పిల్లలు తప్పిపోయే అవకాశం ఉండటంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నామని.. తల్లిదండ్రులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. పిల్లలు తప్పిపోతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
శాశ్వత బస్టాండ్ ఏర్పాటు చేయాలి
మంత్రి సీతక్క మాట్లాడుతూ 2024లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతరకు రవాణా మౌలిక వసతులు కల్పించాలనే దూరదృష్టితో ముందడుగు వేశారని గుర్తు చేశారు. ప్రతి జాతర సమయంలో తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, దీర్ఘకాలిక పరిష్కారంగా శాశ్వత ఆర్టీసీ బస్టాండ్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఏడాది జాతర సందర్భంగా అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భక్తులు, ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కోకుండా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో సంవత్సరాల తరబడి బస్ డిపో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వెంటనే స్పందించి దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో శాశ్వత బస్‌డిపోను మంజూరు చేసినందుకు రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఈడీవో ముని శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: జాన్‌పహాడ్ దర్గా సర్వమత సమ్మేళ్ళానికి ప్రతీక
Follow Us On: Youtube


