కలం వెబ్ డెస్క్: మీరు ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? మీ బోర్డింగ్ పాస్ (Boarding Pass)ను సరిగా గమనించారా? ఏముంది.. ఏదేదో నెంబర్లు, అక్షరాల కోడ్‌లు ఉంటాయి అంతేగా అనుకోకండి. ఈ అక్షరాల్లోనే అసలు కథ ఉంది. మీ బోర్డింగ్ పాస్‌పై ఏ అక్షరాలున్నా నో ప్రాబ్లం.. కానీ ‘SSSS’ అనే అక్షరాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాల్సిందే. ‘SSSS’ అనే అక్షరాలు మీ బోర్డింగ్ పాస్ పై ఉన్నాయంటే మీరు ప్రయాణంలో అదనపు తనిఖీలకు సిద్దంగా ఉండాలి. అసలు ఈ కోడ్ ఎందుకు పెట్టారు? దీని అర్థం ఏమిటి? అనే విషయాలు ఫ్లైట్ జర్నీ చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
అసలు ఈ కోడ్ ఎందుకు వస్తుందంటే..
అమెరికాకు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) ‘SSSS’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని అంతర్జాతీయ భద్రతా ప్రోటోకాల్‌లో భాగంగా పరిగణిస్తారు. ముఖ్యంగా అమెరికాతో సంబంధం ఉన్న ప్రయాణాల్లో ఈ తరహా చెకింగ్ జరుగుతుంది. ‘SSSS’ అంటే Secondary Security Screening Selection (సెకండరీ సెక్యూరిటీ స్క్రీనింగ్ సెలక్షన్) అని అర్థం. ఈ విధానం ఇప్పుడు అంతర్జాతీయంగా అనేక విమానాశ్రయాల్లో అమలవుతోంది. సాధారణంగా చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకోవడం, కేవలం వన్ వే టికెట్ మాత్రమే కొనుగోలు చేయడం, టికెట్ కోసం నగదు రూపంలో భారీగా చెల్లింపులు జరపడం వంటివి చేసినప్పుడు బోర్డింగ్ పాస్‌పై ఈ కోడ్ వస్తుంది. కొన్నిసార్లు సెక్యూరిటీకి ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించినా ఈ కోడ్ కోసం అమలు చేస్తారు. అలాగే ప్రయాణికులు భద్రతా పరంగా సమస్యాత్మకమైన దేశాల నుంచి వచ్చినప్పుడు, అలాంటి దేశాలకు వెళ్లినప్పుడు కూడా ఇలా జరుగుతుంది.
తనిఖీ ప్రక్రియ ఇలా…
‘SSSS’ కోడ్ ఉన్న ప్రయాణికులను సాధారణ తనిఖీలతో పాటు క్షుణ్ణంగా అదనపు తనిఖీలు చేస్తారు. ఇందులో భాగంగా ప్రయాణికుల హ్యాండ్ బ్యాగేజీని పూర్తిగా తెరిచి లోపల ఉన్న వస్తువలన్నింటినీ పరిశీలిస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు క్యారీ చేస్తే వాచ్, ల్యాప్‌టాప్, ఫోన్ వంటివి ఆన్ చేసి చెక్ చేస్తారు. అంతే కాకుండా ప్రయాణ వివరాలు కూడా ఆరా తీస్తారు. ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? అనే ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది. శారీరక తనిఖీ కూడా చేస్తారు. మెటల్ డిటెక్టర్లతో పాటు ప్యాట్-డౌన్ స్క్రీనింగ్ కూడా ఉండవచ్చు. ఈ ప్రక్రియ వల్ల సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున అదనపు తనికీల కోసం ప్రయాణికులు 30 నుంచి 45 నిమిషాల ముందుగానే ఎయిర్ పోర్ట్‌కు చేరుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆందోళన అవసరం లేదు
ప్రయాణికుల బోర్డింగ్ పాస్‌పై ‘SSSS’ కోడ్ ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. ఆ కోడ్ ఉన్నంత మాత్రాన ప్రయాణికుడు నేరస్థుడు కాదని, ఇది కేవలం ఎయిర్‌పోర్టుల్లో భద్రత కోసం నిర్వహించే ఒక ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ కోడ్ వచ్చిన ప్రయాణికులు భద్రతా సిబ్బందికి సహకరించాలని, ఏ ప్రశ్నలు అడిగినా ఓపికగా సమాధానం చెప్పాలని సూచిస్తున్నారు. ఒక వేళ ‘SSSS’ కోడ్ వస్తే ఆన్‌లైన్‌లో బోర్డింగ్ పాస్ రాకపోవచ్చని, దీని కోసం నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి అధికారులను సంప్రదిస్తే సమస్య పరిష్కారం అవుతుందని భరోసా ఇస్తున్నారు.

