రాష్ట్రంలో భూముల విలువ పెంపుపై అంచనాలు

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను పెంచడానికి రంగం సిద్ధమైంది. పది రోజుల్లో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల డిపార్టుమెంటు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నది. ఇన్నర్ రింగ్ రోడ్, ఔట్ రింగ్ రోడ్ ప్రాంతంలోని భూముల ధరలను ప్రామాణికంగా తీసుకుని క్యూర్ ఏరియాలో ల్యాండ్స్ వ్యాల్యూ ఖరారయ్యే అవకాశమున్నది. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూమి విలువ కనీసంగా రూ. 15 లక్షలు పెరిగే అవకాశాలున్నాయి. భూముల విలువ పెంపుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) సచివాలయంలో శనివారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం అశాస్త్రీయ పద్ధతిలో భూముల విలువను ఖరారు చేసిందని ఆరోపించారు. కానీ ఈసారి మాత్రం పూర్తి శాస్త్రీయంగా విలువల సవరణ ఉంటుందన్నారు. ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణ్యన్ సూచనలు, సలహాలను తీసుకున్నామని, సైంటిఫిక్ పద్ధతిలోనే సవరిస్తామని స్పష్టం చేశారు.

నాలుగేండ్లుగా ల్యాండ్ వ్యాల్యూలో మార్పుల్లేవ్ :

గత ప్రభుత్వం ఒకే సంవత్సరంలో రెండుసార్లు భూముల విలువను పెంచిందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా పెంచలేదన్నారు. నాలుగేండ్లుగా అప్పటి భూముల విలువే కొనసాగుతున్నదన్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రతీ సంవత్సరం ఇలాంటి భూముల విలువ సవరణలు ఉంటున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో భూముల విలువ కొన్ని చోట్ల పెరుగుతున్నా మరికొన్ని చోట్ల మాత్రం తగ్గుతాయని సంకేతాలిచ్చారు. ఇందుకు కారణం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే గత ప్రభుత్వం ఖరారు చేసిన గవర్నమెంట్ రేటే ఎక్కువగా ఉన్నదన్నారు. ఇలాంటి చోట్ల తగ్గించడమో లేక స్వల్ప స్థాయిలో పెంచడమో లేక అదే విలువను కొనసాగించడమో చేయక తప్పదన్నారు. గత క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే ఇప్పుడు భూముల విలువలను రెగ్యులరైజ్ చేయాలంటున్నట్లు తెలిపారు. వాస్తవ ధరలను పరిగణలోకి తీసుకుని మార్పులు ఉంటాయన్నారు. ఈ నెల చివరిలోపే అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు.

అర్బన్‌లో రెండంతస్తుల ‘ఇందిరమ్మ ఇండ్లు’ :

ఇప్పటివరకూ ఇందిరమ్మ ఇండ్లు ఒకే అంతస్తులో నిర్మాణమవుతున్నాయి. కానీ అర్బన్‌లో మాత్రం స్థలాభావం కారణంగా రెండంతస్తుల్లో కట్టుకునేలా గైడ్‌లైన్స్ మార్చేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీని గురించి మంత్రి ప్రస్తావిస్తూ.. ఒకే స్ధ‌లంలో అన్న‌ద‌మ్ములు ఇందిర‌మ్మ ఇండ్లను కట్టుకోవాలనుకుంటే సమస్యలు వస్తున్నాయని, అందుకే ‘వ‌న్ ప్ల‌స్ వ‌న్’ ప‌ద్ధతిలో క‌ట్టుకునే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నామని వివరించారు. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లోని ఇందిరమ్మ ఇండ్ల గురించే ఎక్కువగా ఆలోచించామని, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని పేదలకూ ఆ ఫలాలు అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. సుమారు యాభై ఏళ్ల క్రితం క‌ట్టిన వాంబే, ఎన్ఆర్‌జేఏఎంఎస్ త‌దిత‌ర కాల‌నీల్లో ఇండ్లు కూలిపోయే స్ధితికి చేరుకున్నాయని, వాటి స్ధానంలో కూడా ఇందిర‌మ్మ ఇండ్ల‌ను మంజూరు చేసేందుకు ప‌రిశీలిస్తున్నామన్నారు. ఇండ్ల నిర్మాణానికి ల‌బ్దిదారులు స్ధానికంగా ఇసుక‌ను ఉచితంగా పొందేలా, ఎర్త్ ఫిల్లింగ్‌కు అవసరమైన మ‌ట్టిని కూడా పొందేలా అవ‌కాశం ఇవ్వాల‌ని, ఎటువంటి అభ్యంత‌రాలు తెలుప‌కూడ‌ద‌ని అధికారుల‌ను ఆదేశించినట్లు తెలిపారు.

కబ్జాదారులపై కఠినంగానే వ్యవహరిస్తాం :

గ‌తంలో ప్రైవేటు భూముల‌ను సేక‌రించి ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం లే-ఔట్‌లు వేసిందని, వాటిలో కొన్ని ఇప్పటికీ ఖాళీలు ఉన్నాయని, మ‌రికొన్ని చోట్ల క‌బ్జాకు గుర‌య్యాయని మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వంలోని ‘ధ‌ర‌ణి’ కార‌ణంగా భూమి అమ్మిన వ్య‌క్తి పేరిటే మ‌ళ్లీ భూమి ఉన్న‌ట్లు రికార్డులు కంటిన్యూ కావడంతో స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయన్నారు. ఇలాంటివాటిపై స‌మ‌గ్ర‌ నివేదిక ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించినట్లు తెలిపారు. ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేసినవారిని వ‌దిలే ప్ర‌సక్తే లేదని స్పష్టం చేశారు. అవ‌స‌ర‌మైతే ప్ర‌భుత్వ భూముల‌కు ప్ర‌హారీ గోడలు నిర్మిస్తామన్నారు.

సీఎం, మంత్రుల కాన్వాయ్‌ సైజ్ తగ్గింపు :

ప్రధాని మోదీ సూచన మేరకు సీఎం, మంత్రుల కాన్వాయ్‌ను తగ్గిస్తున్నామని మంత్రి పొంగులేటి వివరించారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తుందన్నారు. మంత్రుల కాన్వాయ్‌కు కూడా ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు పెట్టాలో, ఉన్నవాటిని తగ్గించాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

‘డబుల్’ ఇండ్లలో అర్హతలేని లబ్ధిదారులు :

గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారుల్లో అర్హత లేనివారు కూడా ఉన్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. అసంపూర్తిగా ఉండిపోయిన‌ ‘డబుల్’ ఇండ్ల పాత‌ రేట్ల‌తో పూర్తి చేసేలా కాంట్రాక్ట‌ర్ల‌ను కోరామని తెలిపారు. కానీ ఈ ప‌నులను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేసి వారి చేతికే డబ్బులిచ్చి కంప్లీట్ చేసుకునేలా నిర్ణ‌యించామన్నారు. ఈ నెలాఖరులోగా అలాంటి ఇండ్ల‌ను గుర్తించాల్సిందిగా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలిచ్చామని తెలిపారు. మరోవైపు జీహెచ్ఎంసి పరిధిలో ఎన్నికల ముందు హడావుడిగా 70 వేల మంది లబ్దిదారులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైనల్ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు నిర్వహించిన సర్వేలో దాదాపు 60 వేల మంది అక్కడ నివసించట్లేదనేది వెల్లడైందని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల్లో దాదాపు 12% మంది అర్హతలేనివారే ఉన్నారని తెలిపారు. కొంతమంది లబ్ధిదారులు ఆ ఇండ్లను అద్దెకిచ్చారని తెలిపారు. కొన్ని డబుల్ బెడ్రూమ్స్ శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. ఇకపైన లబ్ధిదారులు అక్కడ నివసించేటట్లయితేనే కేటాయిస్తామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>