ఇందిరమ్మ ఇళ్ళ పురోగతి, కేటాయింపుపై కలెక్టర్ సమీక్ష

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల పురోగతి, డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపుపై కలెక్టర్ ఇలా త్రిపాఠి (Nizamabad Collector) సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష జరిపారు. ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసిన ఇళ్ళను లబ్దిదారులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మొదటి విడతలో ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకురాని వారి మంజూరీలను రద్దు చేసిన చోట, వారి స్థానంలో అర్హులైన కొత్త వారిని వెంటనే లబ్దిదారులుగా ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ వారం రోజుల్లోపు పూర్తి చేయాలని గడువు విధించారు. ఇందిరమ్మ కమిటీలను సంప్రదించి ఆసక్తి కలిగిన అర్హులను గుర్తించాలన్నారు.

ఇప్పటికే ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్దిదారుల ఫోటో, పూర్తి వివరాలతో జియో ట్యాగింగ్ సహా సత్వరమే సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. రెండు పడక గదుల ఇళ్ళను అర్హులైన వారికి కేటాయించేందుకు లాటరీ విధానం ద్వారా లబ్దిదారులను ఖరారు చేయాలని, వీడియోగ్రపీ మధ్యన జిల్లా అధికారుల సమక్షంలో పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. అన్ని చోట్ల ఈ నెలాఖరు లోపు డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీ.ఆర్.ఓ గీత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, హౌసింగ్ పీ.డీ గంగాధర్, ఎ.ఈ నివర్తి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>