కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సోమవారం నుండి మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి (Mahabubnagar Prajavani) కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో అంతంతమాత్రంగానే కొనసాగింది. మండలాల్లో ప్రజావాణి తొలిసారిగా మొక్కుబడిగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాలలో ప్రారంభమైన ప్రజావాణి ఆశాజనకంగా సాగలేదు. పంచాయతీ, పురపాలిక, రెవెన్యూ అధికారులు ప్రత్యేక ఓటరు సవరణ ముసాయిదా జాబితా విడుదల ప్రక్రియలో తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో సీఎం ఆదేశాలతో మండల పరిషత్ కార్యాలయాలలో జరిగిన ప్రజావాణి నామమాత్రంగా జరిగింది. ఈ ప్రజావాణికి ఆయా జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇప్పటివరకు ప్రజలు జిల్లా కలెక్టరేట్లల్లో జరిగే ప్రజావాణికే అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడటంతో సమస్యల పరిష్కారం కలెక్టర్ వద్ద జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. దీంతో గతంలో రెవెన్యూ డివిజన్, మండల కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాలు ఉన్నా ప్రజలు రాకపోవడంతో ఆ ప్రక్రియ కనుమరుగయ్యింది. సీఎం అదేశాలతో తిరిగి మండలాల్లో ప్రజావాణి సోమవారం నిర్వహించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 77 మండలాల్లో వందల సంఖ్యలోనే ఫిర్యాదులు అందాయి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో జరిగిన ప్రజావాణిలో రెండు శాఖల మినహా మిగతా అన్ని శాఖల అధికారులు ప్రజావాణికి హాజరయ్యారు. అయితే ఫిర్యాదులు మాత్రం కేవలం మూడు మాత్రమే రావడం, నాగర్ కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.
అధికారులు మండల స్థాయి ప్రజావాణిపై సరైన ప్రచారం అవగాహన కల్పించకపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. జోగులాంబ గద్వాల జిల్లాలోని 13 మండలాలకు సంబంధించి 93 దరఖాస్తులు అందాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని 17 మండలాల గాను 72 ఫిర్యాదుల అందినట్లు అధికారుల ద్వారా తెలిసింది. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సైతం అంతంతామాత్రంగానే ఫిర్యాదుల అందినట్టు తెలుస్తుంది.

