కలం, మెదక్ బ్యూరో : పరిశ్రమలు, నిరుద్యోగ యువతను నేరుగా అనుసంధానించే వినూత్న వ్యవస్థకు మెదక్ జిల్లా వేదికైంది. మనోహరాబాద్ (Manoharabad) మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ‘మెదక్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ ఇండస్ట్రీ కనెక్ట్ పోర్టల్’ ను రాష్ట్ర పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Vivek) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిరుద్యోగం ప్రధాన సమస్యగా మారిందని అన్నారు. దీనికి పరిష్కారం చూపే దిశగా మెదక్ జిల్లా యంత్రాంగం, పరిశ్రమల యాజమాన్యాలు కలిసి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలో దాదాపు వెయ్యికి పైగా పరిశ్రమలు ఉన్నాయని, వాటికి నిరంతరం నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమవుతున్నాయని మంత్రి తెలిపారు. స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను, నైపుణ్యం కలిగిన కార్మికులను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పెట్టుబడులతో ఏర్పాటయ్యే కొత్త పరిశ్రమలకు పెద్ద సంఖ్యలో నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ అవసరమవుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ‘టామ్‌కామ్’ (TOMCOM) సంస్థ ద్వారా విదేశాల్లోని ప్రతిష్టాత్మక కంపెనీల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. విదేశీ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులకు జర్మన్, జపనీస్ వంటి అంతర్జాతీయ భాషలలో ఉచిత శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణతో యువతకు విదేశాలలో నెలకు లక్షల రూపాయల వేతనాలు పొందే అవకాశాలు లభిస్తాయని వివరించారు.
విదేశీ ఉద్యోగాల కోసం వెళ్లే వారి వీసా ఖర్చులలో సగాన్ని ప్రభుత్వం భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేటి తరం విద్యార్థులు కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాకూడదని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాలలోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకుని నైపుణ్యాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పారిశ్రామికవేత్తలు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

