కలం, నిజామాబాద్ బ్యూరో: సీఎం రేవంత్ ఆదేశాల మేరకు డ్రగ్స్ మత్తు పదార్థాలు గంజాయి నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో జిల్లా పోలీస్ శాఖ – ఈగల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. గతంలో గంజాయి డ్రగ్స్ వినియోగం అక్రమ రవాణా కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు , రౌడీ షీటర్లు , అనుమానితులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు.. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వలన యువత భవిష్యత్తు నాశనం అవుతుందని , కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.
గంజాయి డ్రగ్స్ వినియోగం ఆరోగ్యపరంగా ప్రమాదకరమే కాకుండా చట్టపరంగా కూడా తీవ్రమైన నేరమని , ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కేసులు నమోదైన వ్యక్తులు తమ ప్రవర్తన మార్చుకొని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని, మళ్లీ ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగుతుందని, విద్యాసంస్థలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య , ఉపాధి మరియు కుటుంబ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా తమ పరిసరాల్లో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం ఈగల్ టీం పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షల్లో కొంతమంది వ్యక్తులకు డ్రగ్స్ వినియోగం పాజిటివ్‌గా తేలడంతో వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. అదనపు డీసీపీ (ఏ.ఆర్) శ్రీ రామ్ చందర్రావు , నిజామాబాద్ ఏసీపి ప్రకాష్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఈ గల్ టీం డీఎస్పీ ఎం. సోమనాథం, హోమ్ గార్డ్ ఏసిపి కె. దీపక్ చంద్ర , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్ రెడ్డి , నిజామాబాద్ టౌన్ సిఐ శ్రీనివాస రాజ్, సౌత్ రూరల్ సిఐ ఎన్. సురేష్ కుమార్ , నార్త్ రూరల్ సీఐ బి. శ్రీనివాస్, డిచ్పల్లి సిఐ కె. వినోద్ , ధర్పల్లి సిఐ బిక్షపతి, నిజామాబాద్ డివిజన్ ఎస్.హెచ్.ఓలు, ఎస్ఐలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

