‘నిజామాబాద్’ ముసాయిదా ఓటరు జాబితా విడుదల

కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా సోమవారం విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను ప్రతి అర్హత కలిగిన ఓటరు పరిశీలించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా మార్పులు, సవరణలు అవసరమైనా సెప్టెంబర్ 16, 2026లోగా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

జిల్లాలో ఎస్ఐఆర్ – 2026 ప్రక్రియకు పూర్వం 14,39,734 మంది ఓటర్లు ఉండగా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరువాత 17-08-2026 నాటికి జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం 12,28,064 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. వీరిలో 5,83,035 మంది పురుషులు, 6,44,987 మంది మహిళలు, 42 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని అన్నారు. ముసాయిదా జాబితా ప్రకారం నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటర్ల వివరాలు..

నిజామాబాద్ అర్బన్ : 2,24,979
నిజామాబాద్ రూరల్ : 2,33,578
ఆర్మూర్ : 1,89,457
బోధన్ : 1,95,344
బాన్సువాడ: 1,76,449
బాల్కొండ : 2,08,257

జాబితాలో పేరు పరిశీలించుకోవాలి..

అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హుల పేర్లు లేకుండా పారదర్శకమైన, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ సర్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో పేరు పరిశీలించుకోవాలని సూచించారు. పేరు లేని అర్హత కలిగిన వ్యక్తులు, అలాగే ఓటరు వివరాల్లో మార్పులు లేదా సవరణలు కోరుకునే వారు నిర్ణీత గడువులోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు లేదా సవరణలకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి తుది ఓటరు జాబితా రూపొందిస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>