కలెక్టరేట్‌కే జనం క్యూ.. మండల ప్రజావాణికి ఆద‌ర‌ణ క‌రువు!

కలం, ఖమ్మం బ్యూరో: ​పాలనను ప్రజల గుమ్మం ముంగిట్లోకి తీసుకువెళ్లి, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలనే సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మండల స్థాయి ‘ప్రజావాణి’ (Mandal Prajavani) తొలి అడుగులోనే తడబడింది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందైతే వందలాది మంది బాధితులు, అర్జీదారులు క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షించే దృశ్యాలు కనిపిస్తాయి. కానీ, అదే కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువగా మండల కేంద్రాల్లో నిర్వహిస్తే, మొదటి రోజే పలు మండల కార్యాలయాలు జనం లేక వెలవెలబోయాయి. చేతిలో వినతిపత్రాలు పట్టుకొని వచ్చే బాధితులు తక్కువ సంఖ్యలో కనిపించడం పాలనా యంత్రాంగాన్ని, ప్రభుత్వ ఆశయాలను తీవ్ర నిరాశకు గురిచేసింది.

​ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా పరిధిలోని భౌగోళిక పరిస్థితులను గమనిస్తే, పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం అనే రెండు జిల్లాలుగా విడిపోయిన ఈ ప్రాంతంలో మొత్తం 42 మండలాలు ఉన్నాయి. ఇందులో మారుమూల గిరిజన గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు, వ్యవసాయ ఆధారిత పల్లెలు ఎన్నో విస్తరించి ఉన్నాయి. సాధారణంగా కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చే ప్రజల్లో ఎక్కువమంది భూభారతి లేదా ధరణి సంబంధిత సమస్యలు, పోడు భూముల హక్కు పత్రాలు, ఆసరా పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులతోనే వస్తుంటారు. అయితే, ఈ సమస్యలన్నింటికీ కేంద్ర బిందువైన మండల కేంద్రాల్లోనే ఇప్పుడు అర్జీలు స్వీకరిస్తున్నారన్న సమాచారం గ్రామాల్లోని సామాన్యుడి వరకు చేరకపోవడమే ఈ తొలి రోజు విఫలానికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.

ముందస్తుగా గ్రామీణ ప్రాంతాల్లో దండోరా వేయించడం కానీ, ప్రచార మాధ్యమాల ద్వారా పూర్తి అవగాహన కల్పించడం కానీ జరగకపోవడంతో ప్రజలకు ఈ అవకాశం అందుబాటులోకి వచ్చిన విషయమే తెలియకుండా పోయిందని మణుగూరు, దమ్మ పేట మండలాల ప్రజలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనీ దుమ్ముగూడెంలో అత్యధికంగా 41 దరఖాస్తులు రాగా, అన్న‌పురెడ్డిపల్లిలో కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే వచ్చింది. అలాగే ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో అత్యధికంగా 46 అప్లికేషన్లు రాగా, ఏనుకూరులో కేవలం ఇద్దరు అర్జీదారులే ప్రజావాణికి హాజరయ్యారు. మొత్తంగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 250 దరఖాస్తులు, ఖమ్మం జిల్లాలో 272 అప్లికేషన్లు వచ్చాయి.

​దీనికితోడు, ప్రజల్లో వేళ్లూనుకుపోయిన ఒక బలమైన నమ్మకం కూడా ఈ పరిస్థితికి దారితీసింది. మండల స్థాయి అధికారులకు సమస్యను నివేదిస్తే అది ఆఫీసు ఫైళ్లకే పరిమితమవుతుందని, స్వయంగా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే తమ భూ వివాదాలు లేదా సంక్షేమ పథకాల సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయనే అభిప్రాయం బాధితుల్లో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల అధికార పరిమితులు, స్థానిక స్థాయిలో పర్యవేక్షణ లోపించడం కూడా ప్రజలను మళ్లీ కలెక్టరేట్ వైపే నడిపిస్తోంది. తొలి రోజు మండల ప్రజావాణి నిరాశాజనకంగా సాగినప్పటికీ, ప్రభుత్వం జిల్లా యంత్రాంగం గ్రామీణ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించి, మండల ప్రజావాణిలో ఇచ్చే అర్జీలపై కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుందని భరోసా ఇస్తే తప్ప ఈ ఆశయం నెరవేరదని విద్యావంతులు, మేధావులు పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>