ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కల్తీమద్యం ఎపిసోడ్ నడుస్తోంది. రసవత్తరంగా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో రోజురోజుకో మలుపు తీసుకుంటుంది. తాజాగా దీనిపై స్పందించిన మంత్రి అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం మూలాలన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే ఉంటున్నాయని మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు. వాళ్ల చుట్టూ కల్తీ మద్యం ముఠాను ఏర్పాటు చేసుకుని కూటమిపై గుడ్డకాల్చి వేసే ప్రయత్నంలో వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. అవినీతి, కల్తీ చేయడంలో వైసీపీ నేతలది అందెవేసిన చెయ్యని ప్రజలకు బాగా తెలుసని, అందుకే ఎన్నికల్లో సమాధానం ఇచ్చారని విసుర్లు విసిరారు. ‘‘కల్తీ మద్యం తయారు చేసే దొంగల ముఠాను పట్టుకుంది కూటమి ప్రభుత్వం’’ అని ఆయన పునరుద్ఘాటించారు.
‘‘కల్తీ మద్యం గుట్టు మేము విప్పితే జగనే పట్టుకున్నట్లు సంబరాలు చేసుకోవడం ఏంటి? జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం తప్పుదారి పట్టించడానికే ఈ కొత్త నాటకాలకు తెరలేపారు. వైసీపీ హయాంలో కల్తీ మద్యం కారణంగా 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినా వారికి పట్టలేదు. పైగా హేళన చేసి మాట్లాడారు. దానిని ప్రజలు మర్చిపోయారనుకుంటే ఎలా’’ అని ఆయన(Anagani Satya Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తప్పు చేసిన వారెవరైనా శిక్షించి తీరుతుందన్నారు. కల్తీ మద్యం కేసులో ఉన్న టీడీపీ నేతలపై ఇప్పటికే పార్టీ హైకమాండ్ యాక్షన్ తీసుకుందని, వైసీపీ హయాంలో అలా జరిగిందా? అని ప్రశ్నించారు. జగన్ హయాంలో కల్తీ మద్యం తయారీ చేసిన వ్యక్తికి ఇంటికి పిలిచి భోజనం పెట్టి సత్కరించారని ఆరోపణలు గుప్పించారు.

