చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna). తెలంగాణలో తాను స్థాపించిన ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ(TRP)’ గుర్తింపు, గుర్తుపై తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి తన పార్టీకి వీలు కల్పించాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం ఆయన అభ్యర్థనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.
అయితే తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు(BC Reservations), రాజ్యాధికారం లక్ష్యంగానే తాను పార్టీ స్థాపించినట్లు తీన్మార్ మల్లన్న గతంలోనే స్పష్టం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలకు అవకాశం కల్పించడం లేదని, అందుకే బీసీల కోసం తాను పార్టీని స్థాపిస్తున్నానని చెప్పారు. కాగా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో వాటిలో పోటీ చేయడానికి తన పార్టీకి గుర్తింపు, ఎన్నికల గుర్తును కేటాయించాలని కోరుతూ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) పిటిషన్ దాఖలు చేశారు.

