కల్తీ మద్యం వెనక సూత్రధారి టీడీపీ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తీవ్రంగా ఖండించారు. ప్రజల ప్రాణాల గురించి వైసీపీ నేతలు మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లెవేస్తున్నట్లు ఉందని చురకలంటించారు. ‘‘వైసీపీ హయాంలో జంగారెడ్డి గూడెంలో కల్తీమద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతే.. ‘పోతే పోయారు.. ఇంకా ఏడుస్తారేంటి’ అని అప్పట్లో మంత్రిగా ఉన్న జోగిరమేష్ అహంకారంగా అన్న మాటలు నాకు, ప్రజలకు ఇంకా గుర్తున్నాయి’’ అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయినా ఇప్పుడు అన్నమయ్య(Annamayya) జిల్లాలో లభించిన కల్తీమద్యం, తయారీ కేంద్రం విషయంలో తమ ప్రభుత్వం వైషమ్యాలు చూపడం లేదని స్పష్టం చేశారు. దాని వెనక తమపార్టీ నేతల హస్తం ఉందని తెలిసిన వెంటనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, సూత్రధారులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామని చెప్పారు. గతంలో కల్తీ మద్యంతో మరణాలు సంభవిస్తే వాటిని సహజ మరణాలని చెప్పి నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్ అని, కానీ తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అలా కాదని, పార్టీ నేతలున్నారని తెలిసిన వెంటనే వారిని అరెస్ట్ చేయించామని అన్నారు.
‘‘కల్తీమద్యాన్ని పట్టుకుంది మా ప్రభుత్వం. నిందితుల్లో ఇద్దరు టీడీపీ(TDP) వారుంటే వారిని సస్పెండ్ చేశారు మా అధ్యక్షుడు. మీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో మర్చిపోయి ఇప్పుడు ఆరోపణలు చేయకండి. డబ్బుకు కక్కుర్తి పడి ‘జే బ్రాండ్(J Brand)’తో వేల ప్రాణాలు బలితీసుకున్నారు. దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఎందుకు సస్పెండ్ చేయలేదు’’ అని ప్రశ్నించారు. ‘‘సస్పెండ్ చేయకపోగా ఇంటికి పిలిపించి భోజనం పెట్టి సన్మానించారు. కల్తీ మద్యం గురించి, నిందితులకు వత్తాసు పలకడం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది’’ అని Nara Lokesh ప్రశ్నించారు.

