కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని భద్రాచలం (Bhadrachalam) ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాపాయ స్థితికి చేరిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని ముసలమడుగు గ్రామ పంచాయతీకి చెందిన మేకల సీతమ్మ అనే డయాలసిస్ రోగి సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రమాదకర పరిస్థితికి చేరుకుంది. వివరాల ప్రకారం, ఆమె రోజువిడిచి రోజు ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటూ ఉండేది. ఈ క్రమంలో సోమవారం కూడా చికిత్స కోసం ఆసుపత్రికి చేరుకుంది.
ఆమెకు రక్తం తక్కువగా ఉందని గుర్తించిన వైద్య సిబ్బంది రక్తం ఎక్కించే ప్రక్రియ ప్రారంభించారు. అయితే రక్తం ఎక్కించే సమయంలో ఉపయోగించే పైపు అకస్మాత్తుగా తెగిపోవడంతో రక్తం బయటకు కారిపోవడం ప్రారంభమైంది. ఈ పరిస్థితిని అక్కడి నర్సులు గమనించకపోవడంతో, దాదాపు రెండు గంటల పాటు రక్తం వృథాగా కారినట్లు సమాచారం.
దీంతో సీతమ్మ శరీరంలో రక్తం గణనీయంగా తగ్గిపోయి ఆమె పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆమె తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సీతమ్మ భర్త తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భార్య ప్రాణాపాయ స్థితికి చేరుకుందని ఆరోపించారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే పేద ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: మంత్రి సొంత జిల్లాలో మంచినీళ్ళకు కరువు
Follow Us On : WhatsApp

