కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం మహా జాతర(Medaram Jatara) నేటితో ముగియనుంది. జనవరి 28న ప్రారంభమైన జాతర వైభవంగా కొనసాగుతోంది. నేడు జాతర చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు తెలంగాణ(Telangana)లోని నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గద్దెల వద్ద అమ్మవార్ల దర్శనం కోసం కిలోమీటర్ల భక్తులు బారులుతీరారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక జాతరలో ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 1 వరకు ఆర్టీసీ(RTC) సేవలు కొనసాగనున్నాయి. జాతరకు కోటి మంది వరకు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. గురువారం సాయంత్రం వరకు సుమారు 50 లక్షల భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు సమాచారం.


