కలం, వెబ్ డెస్క్: మేడారం జాతర(Medaram Jatara)లో ట్రాఫిక్ కష్టాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అమ్మవార్ల దర్శనం ముగించుకున్న భక్తులు తిరుగు ప్రయాణం అయ్యేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచే మేడారంలో ట్రాఫిక్ జామ్(Traffic Jam) నెలకొంది. కిలో మీటర్ల మేర రద్దీ ఏర్పడింది. దీంతో వేలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తాడ్వాయి-పస్ర, తాడ్వాయి-మేడారం రహదారుల్లో వాహనాలు ముందుకు కదలడం లేదు. 16 కిలోమీటర్ల ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న సాయంత్రం నుంచి వేలాది మంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. చంటి పిల్లల తల్లులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ఆధునిక టెక్నాలజీ కూడా ఫలితాలు ఇవ్వడం లేదు. అధికారులకు పోలీసులకు మధ్య తీవ్ర సమన్వయ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ ట్రాఫిక్‌లో ఆర్టీసీ బస్సులు(RTC buses) చిక్కుకున్నాయి. గంటల తరబడి బస్టాండ్‌లో ఎదురుచూస్తున్నా కూడా ఒక్క బస్సు కూడా రావడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ, హైదరాబాద్ వెళ్లేందుకు కనీసం ఒక్క బస్సు కూడా లేదని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు ఎవ్వరూ అందుబాటులో లేరని చెప్తున్నారు. ఇప్పటికే వేలాది మందితో మేడారం తాత్కాలిక బస్టాండ్ నిండిపోయింది.


