కలం, వరంగల్ బ్యూరో : కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర (Medaram Maha Jatara) ప్రారంభమైంది. కన్నేపల్లి నుంచి సారలమ్మ, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజు ప్రతిరూపాలను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాల ప్రతిష్టాపనతో తొలిఘట్టం ముగుస్తుంది.
78 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో ఆదివాసీ పూజారులు ఒకరోజు ముందే బయలుదేరారు. పూర్తిగా కాలినడకన కాళ్లకు చెప్పులు లేకుండా సాగే ఈ యాత్రలో ఏడు వాగులు, దట్టమైన అడవి మీదుగా ప్రయాణం ఉంటుంది. సరిగ్గా నేడు (జనవరి 28 బుధవారం) సాయంత్రం సారలమ్మ గద్దె పైకి చేరుకుంటారు. అటు 40 కిలోమీటర్ల దూరంలోని కొండాయి నుంచి గోవిందరాజు ప్రతిరూపాలతో పూజారులు అదే సమయానికి గద్దెల దగ్గరకు చేరుకుంటారు.
ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ ప్రాంతమంతా సమ్మక్క సారక్క (Sammakka-Saralamma) నామస్మరణతో మారుమోగిపోతుంది. ఇక జాతరలో అసలు ఘట్టం గురువారం సాయంత్రం ఆవిష్కృతమవుతుంది. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్కని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. ఈ మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది.


