కలం, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత భారత సమాజంలో రాజ్యాధారాన్ని చేజిక్కించుకోడానికి సాయుధ పోరాటం, ప్రజాసైన్యం నిర్మాణమే ఏకైక మార్గమని మావోయిస్టు పార్టీ (Maoist Party) స్పష్టం చేసింది. పార్టీకి ద్రోహం చేసి ఆయుధాలను శత్రువుకు అప్పజెప్పి విప్లవానికి నష్టం చేసిన సోను, దేవ్‌జీలాంటివారంతా విప్లవ ద్రోహులేనని పేర్కొన్నది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) 1970వ దశకంలో ఇలాంటి సంక్షోభాన్నే చవిచూసిందని, కానీ ఆ గడ్డు పరిస్థితులను అధిగమించి బలమైన విప్లవోద్యమాన్ని నిర్మించిందని, ఇప్పుడు కూడా అలాంటిదే రిపీట్ అవుతుందని నార్త్ కోఆర్డినేషన్ కమిటీ పేరుతో విడుదలైన ప్రకటనలో మావోయిస్టు పార్టీ వ్యాఖ్యానించింది. ఆపరేషన్ కగార్ ముగిసిందని, దేశం మొత్తం మీద కేవలం రెండు జిల్లాలకు మాత్రమే ఆ పార్టీ కార్యకలాపాలు పరిమితమయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు వారాల తర్వాత ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అవకాశవాద, విచ్ఛిన్నకర, రివిజనిస్టులను భూస్థాపితం చేయాలని విప్లవ ప్రజానీకానికి విజ్ఞప్తి చేసింది.
వారంతా విప్లవకారుల ముసుగులో ఉన్న ద్రోహులు :
రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి రెండు సమాంతర మార్గాలు ఉన్నాయని, అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నది. మొదటి మార్గం మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో, చారుమజుందార్, బసవరాజు హిడ్మా, కన్హయా ఛటర్జీ, కోసదాదా, రాజుదాదా లాంటి నిఖార్సయిన విప్లవకారులదని మరొకటి కాట్స్కీ, లిన్‌పియావో, ప్రచండ, మల్లోజుల, కోబాడ్ గాంధీ, దేవ్‌జీ లాంటి విప్లవ ద్రోహులదని ఆ ప్రకటన అభివర్ణించింది. కార్మికవర్గ స్ఫూర్తిని బలహీనపర్చి శత్రువు ఏజెంట్లుగా మారి విప్లవోద్యమాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించిన విప్లవ ద్రోహులే వారంతా అని పేర్కొన్నది. వీరికి వ్యతిరేకంగా చేసే పోరాటం ద్వారానే సరైన రాజకీయ పంథా మనుగడ సాగిస్తుందన్నది. వారు విప్లవకారుల ముసుగులో ఉన్న శత్రు ఏజెంట్లు అని వ్యాఖ్యానించింది. పాలకవర్గాలు సృష్టించే అడ్డంకుల మధ్య మావోయిస్టు పార్టీ (Maoist party) 9వ కాంగ్రెస్ రాజకీయ మార్గాన్ని అమలు చేయడానికి ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నది.
గెరిల్లా యుద్ధం, ప్రజాసైన్య నిర్మాణం.. :
విప్లవం మొదటి నుంచీ సాయుధ పోరాటం ద్వారానే జరుగుతుందని, నూతన ప్రజాస్వామిక విప్లవ కాలంలో ప్రధాన పోరాట రూపం సాయుధ పోరాటమేనని, పార్టీ ప్రధాన రూపం ప్రజాసైన్యమేనని నొక్కిచెప్పింది. సాయుధ పోరాటం లేకుండా ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాల నిర్మాణం విజయవంతం కాదని పేర్కొన్నది. గెరిల్లా యుద్ధాన్ని అభివృద్ధి చేయడం, విస్తరించడం ద్వారానే రాజ్యాధికారానికి పునాది పడుతుందన్నది. “నేడు బలహీనంగా ఉండొచ్చు.. కానీ అది వ్యూహాత్మక బలహీనత కాదు… దేశ ప్రజలను నలిపివేస్తున్న సామ్రాజ్యవాదం, దళారీ బూర్జువా పెట్టుబడిదారీ విధానం, భూస్వామ్య వ్యవస్థ అనే మూడు పెద్ద పర్వతాలను ధ్వంసం చేయడానికి మేం తప్పక ఎదుగుతాం…” అని ఆ ప్రకటనలో ఎన్‌సీసీ పేర్కొన్నది. చారుమజుందార్ చనిపోయిన తర్వాత 1970వ దశకంలో పార్టీ ముక్కలైందని, పుంజుకుని ఇప్పుడు వ్యూహాత్మక ప్రాంతాలలో ప్రజాయుద్ధానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగామని గుర్తుచేసింది. ఇప్పుడు అవకాశవాదాన్ని, విద్రోహాన్ని ఓడించి, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి, సోషలిజాన్ని, ఆ తర్వాత కమ్యూనిజాన్ని సాధిస్తామన్న ధీమాను ఎన్‌సీసీ వ్యక్తం చేసింది.
దేవ్‌జీ వాదన ‘నయా ప్రచండ’ వాదమే :
దేవ్‌జీ పార్టీ కేంద్ర కమిటీ, పాలిట్‌బ్యూరో సభ్యుడే అయినా శత్రువు ముందు లొంగిపోయాడని, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నది. ఇప్పటికీ మార్క్సిజం-లెనినిజం-మావోయిజాన్ని నమ్ముతానంటూ చెప్పుకుంటున్నారని, చట్టబద్ధమైన మార్గాల్లో పనిచేస్తానని, మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతానని చెప్పడం అర్థరహితమని వ్యాఖ్యానించింది. నిజమైన కమ్యూనిస్టు పార్టీలు బహిరంగంగా, చట్టబద్ధంగా పనిచేయవని, చట్టబద్ధమైన పద్ధతుల్లోకి పార్టీని తీసుకెళ్లాలని చూసేవారు శత్రువులేనని లెనిన్ చెప్పిన అంశాన్ని ఎన్‌సీసీ తాజా ప్రకటనలో ఉదహరించింది. దేవ్ జీ విప్లవకారుడి చర్మం కప్పుకున్న మరో సోనూ అని పేర్కొన్నది. నేపాల్ యువత తిరస్కరించిన ఈ నయా-ప్రచండవాదానికి భవిష్యత్తు లేదని పేర్కొన్నది. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం ఎలాంటి వర్గాలూ లేవని స్పష్టం చేసింది. విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు ప్రకటించింది.
Read Also: అజారుద్దీన్, కోదండరాంలకు లైన్ క్లియర్
Follow Us On : WhatsApp

