ఆర్టీసీ స‌మ్మె.. ఆ అధికారుల‌పై స‌ర్కాస్ ఆగ్ర‌హం

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రమంతా ఇప్పుడు ఆర్టీసీ సమ్మె (TGSRTC Strike) పైనే చర్చ జరుగుతున్నది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సరిగా పట్టించుకోకపోవడం కారణమన్నది కొందరు కార్మికుల వాదన. అధికారుల పెత్తనమే కారణమన్నది మరికొందరి అభిప్రాయం. కార్మికుల పట్ల చిన్నచూపు చూసే ధోరణితో కొందరు ఆఫీసర్లు నిర్లక్ష్యపు వైఖరి ప్రదర్శించారని, జేఏసీ ప్రతినిధులతో చర్చల సందర్భంగా వారు సరిగా డీల్ చేసి ఉంటే సమ్మె జరిగేదే కాదన్నది ఇంకొందరి వాదన. ఏ వాదన ఎలా ఉన్నా చివరకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సంబంధిత మంత్రిత్వశాఖ దగ్గరే పరిష్కారం కావాల్సిన సమస్య అటు మంత్రి మాట తీరు, ఇటు అధికారుల పెత్తందారీ మనస్తత్వంతో నిరవధిక సమ్మె వరకు వెళ్ళింది. నర్సంపేట్ డ్రైవర్ ఆత్మహత్యతో ఆర్టీసీ సమ్మె తీవ్ర అంశంగా మారింది. అధికారులకు పెత్తనం కట్టబెట్టేకంటే మంత్రుల బృందమే చొరవ తీసుకుంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేదే కాదన్నది తాజా అభిప్రాయం.

ఆఫీసర్ల మాటలతోనే జేఏసీ ప్రతినిధుల్లో ఆగ్రహం :

ఆర్టీసీ కార్మికుల సమ్మె (TGSRTC Strike) ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు నలుగురు ఐఏఎస్ అధికారులు చర్చల కోసం రంగంలోకి దిగారు. సమ్మె నివారణ కోసం జేఏసీ ప్రతినిధులను కన్విన్స్ చేయడానికి బదులు రెచ్చగొట్టే తీరులో కామెంట్స్ చేశారని, ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించారని, చివరకు ప్రభుత్వం పరిష్కారం కోసం ప్రయత్నించడంలేదనే అభిప్రాయానికి తావిచ్చిందని కార్మిక సంఘాల ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకవైపు చర్చలు జరుగుతుండగానే తమను చాలా చిన్నచూపు చూసి మధ్యలోనే వెళ్ళిపోయారని, పరిష్కరించాలన్న ఉద్దేశం లేదనే అభిప్రాయం తమకు ఏర్పడిందని జేఏసీ ప్రతినిది ఈ నెల 21 రాత్రి మీడియాతో వ్యాఖ్యానించారు. సమ్మె చేసుకుంటే చేసుకోండి.. అంటూ నిర్లక్ష్యంగా, రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడారని గుర్తుచేశారు. తాజాగా డిప్యూటీ సీఎం సహా నలుగురు మంత్రులతో సచివాలయంలో చర్చల సందర్భంగా ఆ అంశం ప్రస్తావనకు వచ్చింది.

ఆఫీసర్లతో భేటీకే సిద్ధపడని జేఏసే లీడర్లు :

సమ్మెకు ముందురోజు అధికారులు వ్యవహరించిన తీరుతో మనస్థాపానికి గురైన జేఏసీ ప్రతినిధులు సచివాలయంలో శుక్రవారం మరోమారు భేటీ కావడానికి సుముఖత చూపలేదు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదంటూ స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించి టైమ్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ రోజు అధికారుల వైఖరితో నొచ్చుకున్న జేఏసీ ప్రతినిధులు మరోమారు సమావేశానికి సిద్ధం కాలేదు. సచివాలయానికి వచ్చినా మంత్రులతో మాట్లాడాతాం.. ఆఫీసర్లతో మాట్లాడేది లేదు.. మంత్రుల సమక్షంలోనే అధికారులతో చర్చలు ఉంటాయి.. అంటూ జేఏసీ ప్రతినిధులు షరతు పెట్టారు. చివరకు మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యంతో ప్రతినిధులు కన్విన్స్ అయ్యి అధికారుల స్థాయి చర్చలకు హాజరయ్యారు.

ప్రభుత్వ స్పందన పట్ల జేఏసీకి పాజిటివ్ సెన్స్ :

ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు సమ్మె వరకూ వెళ్ళకుండా నివారించే పరిస్థితులు ఉన్నప్పటికీ కేవలం అధికారుల తీరు వల్లనే ఈ స్థాయి చేరుకుందన్న జేఏసీ ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న మంత్రుల బృందం ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించింది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి, హేళనకు గురైన ఆర్టీసీ కార్మికులకు రెండేండ్లలోనే చేసిన పనులను వివరించింది. డీఏలన్నింటినీ క్లియర్ చేయడం, సహకార సొసైటీ బకాయిలు సహా పీఎఫ్ బకాయిల రీపేమెంట్, గత ప్రభుత్వంలో సర్వీసు నుంచి రిమూవ్ అయినవారికి రీప్లేస్‌మెంట్, కారుణ్య నియామకాలు, ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. వీటన్నింటినీ మంత్రుల బృందం ప్రస్తావించడంతో జేఏసీ ప్రతినిధులు కన్విన్స్ అయ్యారు. కానీ ఆఫీసర్ల కమిటీ మాత్రం ఖాకీ బట్టల కార్మికులను లెక్క చేయని తీరులో ట్రీట్ చేసిందనే అసంతృప్తి ఆగ్రహం స్థాయికి చేరుకుని సమ్మెకు దారితీసిందని తాజా చర్చల సందర్భంగా వెల్లడైంది.

Read Also: ఐదు కీలక హామీలు ప్రకటించిన కవిత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>