కలం, వెబ్ డెస్క్: మణిపూర్(Manipur)లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలోని మోయిరాంగ్ సమీప ట్రోంగ్లావోబి అవాంగ్ లీకై ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తల్లి తీవ్రంగా గాయపడగా.. ఇంపాల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచే బిష్ణుపూర్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ జిల్లాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పలుచోట్ల టైర్లు తగులబెట్టి రహదారులను దిగ్బంధించారు. ఖురై, వాంగ్కేహి, యైరిపోక్, క్వాకైతెల్, థాంగ్మెయిబాండ్ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి.
భద్రతా బలగాల శిబిరంపై దాడి
బాంబు దాడి ఘటనతో నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోంగ్లావోబికి సమీపంలో ఉన్న కేంద్ర భద్రతా దళాల శిబిరంపై దాడికి దిగారు. శిబిరంలోకి చొరబడి వాహనాలను ధ్వంసం చేసి, కొన్నింటికి నిప్పంటించారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి భద్రతా సిబ్బంది కాల్పులు జరపగా, కనీసం నలుగురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. బిష్ణుపూర్ జిల్లా ఖా పొత్సాంగ్‌బామ్ ప్రాంతంలో, అలాగే ఇంఫాల్–మోయిరాంగ్ మార్గంలో మహిళలు పెద్ద ఎత్తున రహదారులను దిగ్బంధించి భద్రతా దళాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణిపూర్‌లో (Manipur) 2023 మే నుంచి మెయిటీస్, కుకి-జో వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతున్నది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 260 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ట్రోంగ్లావోబి ప్రాంతం చురాచంద్‌పూర్ కొండ ప్రాంతాలకు సమీపంగా ఉండటంతో గతంలో కూడా కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజా ఘటనతో మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మళ్లీ ఆందోళనకరంగా మారింది. అధికారులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
Read Also: రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం: మాజీ మంత్రి రోజా
Follow Us On: X(Twitter)

