కలం, వెబ్‌డెస్క్: వేసవి అంటే అందరికీ గుర్తొచ్చేది మామిడి పండ్లు (Mangoes). మామిడి పండ్లను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. తియ్యటి రుచి, రసంతో నిండిన ఈ మామిడి పండ్లను పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే మామిడి పండును ‘పండ్ల రాజు’ అని పిలుస్తారు. అయితే ఈ పండు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మామిడితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా మరి.
మామిడితో రోగనిరోధక శక్తి..
మామిడి పండు రోగనిరోధక శక్తి పెంచడం నుంచి గుండె ఆరోగ్యం వరకు అనేక ప్రయోనాలను అందిస్తుంది. ముఖ్యంగా వేసవిలో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. మామిడిలో ఉంటే విటమిన్లు ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మేజర్ రోల్ పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మామిడి పండులో విటమిన్ A, విటమిన్ C, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయి. మామిడి పండులో ఉండే విటమిన్ C శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. తరచూ జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే వారికి మామిడి ఎంతో మేలు చేస్తుంది.
మామిడితో చర్మసౌందర్యం
అంతే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో కూడా మామిడి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలామంది వేసవిలో మామిడి పండును ‘సహజ బ్యూటీ ఫుడ్’గా భావిస్తారు.
కంటి ఆరోగ్యానికి..
మామిడి పండులో ఉంటే విటమిన్ A కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కంప్యూటర్, మొబైల్ ఎక్కువగా ఉపయోగించే ఈ రోజుల్లో కళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. అలాంటి వారికి మామిడి మంచి పోషకాహారంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇన్‌స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది..
మామిడిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సక్రమంగా ఉంచి, మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది మంచి సహజ ఔషధంలా పనిచేస్తుంది. అదేవిధంగా శరీరానికి తక్షణ శక్తిని అందించే లక్షణం కూడా మామిడికి ఉంది కాబట్టి అలసటగా అనిపించినప్పుడు ఒక పండు తింటే శరీరం వెంటనే ఉత్సాహంగా మారుతుందని సూచిస్తున్నారు నిపుణులు.
అయితే మామిడి ఎంత ఆరోగ్యకరమైనదైనా పరిమితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. అధికంగా తింటే శరీరంలో వేడి పెరగడం, చర్మ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహాతో పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది. ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన వరాలలో మామిడి పండు ఒకటి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ పండును సరైన మోతాదులో తీసుకుంటే వేసవిలో శరీరం ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

