కలం, మెదక్ బ్యూరో: సింగూరులో నీటి నిల్వల అడుగంటుతుండగా (Singur Water Crisis) సంగారెడ్డి జిల్లాలోని బీరు తయారీ కంపెనీలకు నీటి సరఫరా అంశం వివాదాస్పదంగా మారుతున్నది. ఎల్ నినోతో కరువు పరిస్థితుల నేపథ్యంలో సింగూరు ప్రాజెక్ట్ లోని కొద్దిపాటి నీటిని రాబోయే రోజుల్లో ప్రజలకు తాగునీటికి పంపిణీ చేయాల్సిందిపోయి, బీర్ల కంపెనీలకు సరఫరా చేయడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు బీరు కంపెనీలకు నీటి సరఫరాపై అధికారులు సమాచారం గోప్యంగా ఉంచడం పలు అనుమానలకు తావిస్తున్నది. కరువు నెలకొన్న దృష్ట్యా బీరు కంపెనీలకు నీటి సరఫరా రాజకీయంగా దుమారం లేపుతున్నది.
ఆగని మంజీరా నీటి సరఫరా
బేవరేజెస్ కంపెనీలకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా నది నీటి నాణ్యత బీరు తయారీకి అనుకూలం. ఆ నీటితో తయారైన బీర్లు ఉత్పత్తులు రుచిగా, నాణ్యమైనవిగా ఉండటంతో జిల్లాలో పెద్దఎత్తున బేవరేజెస్ కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. ఇక్కడినుండే పలు రాష్ట్రాలకు బీర్ల ఉత్పత్తులను సరఫరా చేస్తుంటారు. కొండాపూర్ మండలం మల్లేపల్లి, చౌటకూరు, ఇటిక్యాల ప్రాంతాల్లోని దాదాపు 8 వరకు బీరు, మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీలకు అవసరమైన నీటిని జలమండలి సరఫరా చేస్తున్నది.
కొండాపూర్ మండలం మల్లేపల్లిలోని యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ (యూబీ గోల్కొండ యూనిట్-1) బీరు కంపెనీకి రోజుకు 960 కిలోలీటర్లు (9 లక్షల 60 వేల లీటర్లు), సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌లోని యూబీ నిజాం బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్(యూనిట్-2) బీరు కంపెనీకి రోజుకు 200 కిలోలీటర్లు(2 లక్షల లీటర్లు) నీటిని సరఫరా చేస్తున్నారు. మల్లేపల్లిలోని కార్ల్స్‌బర్గ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, క్రౌన్ బీర్స్ ఇండియా, లిలాసన్స్ అల్కో బెవ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు కూడా నీటిని పంపిణీ చేస్తున్నారు. మల్లేపల్లిలోని ఎస్‌జీ జ్యూస్ కంపెనీకి రోజుకు 30 కిలోలీటర్ల నీరు సరఫరా అవుతున్నది.
నదిలో అక్రమ బోర్లపై ఫిర్యాదు చేసినా..
ఆయా కంపెనీలకు నీటి లభ్యత లేకపోవడంతో పుల్కల్ మండలం శివ్వంపేటలోని చార్మినార్ బ్రూవరీస్ లిమిటెడ్, ఫసల్ వాదీలోని గణపతి షుగర్ ఫ్యాక్టరీ, చౌటుకూర్ లోని బీర్ కంపెనీలు ఎలాంటి అనుమతులు లేకుండానే మంజీరా నదిలోనే అక్రమంగా బోర్లు వేసి నీళ్లను తోడేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా నది బోర్లు వేసి నీటిని తరలించడం పూర్తిగా చట్టవిరుద్ధం. చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉంది. వాణిజ్య అవసరాలకు కంపెనీలు నదిలోనే బోర్లు వేసి నీటి తోడుతుండటంపై ఫిర్యాదులు అందినా కానీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.
నీటి లెక్కలు చెప్పని అధికారులు
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మంజీరా నదిపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్ట్ పూర్తి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు. ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 2.389 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది. మరోవైపు హైదరాబాద్ సిటీ తాగునీటికి జలమండలి, మిషన్ భగీరథ అధికారులు తాగు నీటిని తీసుకెళేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
నీటి తరలింపు పూర్తయితే డ్యామ్‌లో కేవలం 0.87 టీఎంసీల డెడ్ స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. వచ్చే డిసెంబర్ నాటికే డ్యామ్‌లు పూర్తిగా ఎండిపోయి ఖాళీగా మారే పరిస్థితి నెలకొంది. బేవరేజెస్, ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలకు మంజీరా నీటిని జలమండలి సరఫరా చేస్తున్నది. కొన్నిఫార్మా కంపెనీలకు సరఫరా తగ్గించినట్లు తెలుస్తున్నది. కానీ బీరు పరిశ్రమలకు నీటి సరఫరా తగ్గించారా లేదా అనేది అనుమానంగా మారింది. రోజువారీగా ఏమాత్రం తగ్గించకుండా పరిశ్రమలకు నీటిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ..
జిల్లాలో బీరు పరిశ్రమలకు సరఫరా చేస్తున్న నీటి వివరాలను అధికారులు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. నీటి సరఫరా తగ్గించారా.. లేదా అనేది అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఒకవైపు తీవ్రమైన తాగునీటి ఎద్దడి ముంచుకొస్తుంటే బీరు పరిశ్రమలకు సరఫరాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధికారులు, జలమండలి అధికారుల మీద, జలమండలి అధికారులు మిషన్ భగీరథ అధికారుల మీద నెట్టేసుకుంటున్నారు. నీటి లెక్కలపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఆ మూడు విభాగాల అధికారులు తీరు పలు అనుమానలకు తావిస్తున్నది.
ప్రతిపక్షాల ఆగ్రహం
ముందు జాగ్రత్త చర్యలు లేకుండా మరమ్మతుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సింగూరు ప్రాజెక్ట్ లోని నీటిని ఖాళీ చేయడంతో తాగునీటికి ప్రజల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు సింగూరు ప్రాజెక్టులో కేవలం 2 టీఎంసీల నీళ్లు మాత్రమే మిగిలాయి. అది కూడా ఖాళీ కావడంతో సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని వందలాది గ్రామాలకు తాగునీటి గండం ఏర్పడింది.
బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఐఐటీ హైదరాబాద్‌లకు నీళ్లు ఇవ్వలేమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. తీవ్ర కరువు పరిస్థితుల్లో జిల్లాలోని బీరు కంపెనీలకు నీటి సరఫరాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు తాగునీటిని ఇవ్వకుండా బీరు కంపెనీలకు భారీగా నీటిని సరఫరా చేస్తున్నారనే చర్చ నడుస్తున్నది.
రైతులు వేస్తే అక్రమ కేసులని..
ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లు తెచ్చుకుంటే సీజ్ చేస్తున్నారని, రైతులు వాగులో బోరు వేస్తే క్రిమినల్ కేసులు పెడుతున్నారని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు. బీరు ఫ్యాక్టరీలు ఏకంగా మంజీరా నదిలోనే 20, 30 హెచ్‌పీ మోటార్లతో అక్రమ బోర్లు వేసి నదిని ఎడారిగా మారుస్తుంటే అధికారులు నిద్రపోతున్నారని మండిపడుతున్నారు. ఎల్ నినో పరిస్థితులపై మంత్రుల సమీక్షా సమావేశంలోనూ బీరు కంపెనీలకు నీటి సరఫరాపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిలదీశారు.
బీజేపీకి కి చెందిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా జిల్లా పర్యటన సందర్భాల్లో ప్రభుత్వ వైకరిని తప్పుబడుతున్నారు. తక్షణమే బీరు కంపెనీలకు నీటి సరఫరా ఆపివేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు అధికార కాంగ్రెస్ నేతలు కౌంటర్ చేయడం లేదు.

