కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ సమ్మిట్ –2026 తో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయా సమావేశాల్లో పాలుపంచుకుంటారు.
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరుగుతున్న భారత్ సమ్మిట్ చివరి రోజు కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పలు సమావేశాల్లో పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు, ప్రపంచ దక్షిణాది దేశాల మధ్య సహకారం వంటి అంశాలపై చర్చంచనున్నారు.
భేటీల అనంతరం 10.30 గంటలకు హైటెక్ సిటీలోని శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు రాహుల్, రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్లతో కలిసి ర్యాలీ నిర్వహస్తారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాన్ని రాహుల్ గాంధీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన (Rahul Gandhi) గిగ్ వర్కర్లతో మాట్లాడతారు. రాహుల్ పర్యటనతో రాష్ట్ర పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.

