కాసుపత్రులు.. వైద్యం పేరుతో వసూళ్ల దందా!?

కలం, మహబూబ్ నగర్​ బ్యూరో: పేదల ప్రాణాలతో ప్రైవేట్ ఆసుపత్రులు చెలగాటమాడుతున్నాయి. ఉమ్మడి మహబూబ్​ నగర్ (Mahabubnagar) జిల్లాలో వందలాది ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి. దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వైద్యం పేరుతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి టెస్టులు, ఫీజుల పేరిట లక్షల్లో కాజేస్తున్నాయి. చివరకు రోగి ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేకుండా పోతుంది. కొన్నాళ్లుగా మహబూబ్ నగర్ జిల్లాలో వైద్య సేవలు, రోగుల మరణాలపై ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగులు మరణిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆందోళనలకు దిగి దాడులకు పాల్పడుతున్నారు. మరోవైపు తమపై దాడులు జరుగుతున్నాయని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొన్ని ఘటనలు ఇలా..

కొద్దిరోజుల కింద నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసానిపల్లికి చెందిన శరణప్ప అనారోగ్యంతో మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. డాక్టర్ అందుబాటులో లేకున్నా వాట్సాప్ ద్వారా ఆయన సూచించిన మందులను సిబ్బంది పేషెంట్ కు ఇస్తూ వైద్యం చేశారు. దీంతో పేషెంట్ పరిస్థితి సీరియస్ అయి మృతి చెందారు. ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.

వారం రోజుల కింద మహబూబ్ నగర్ లోని ప్రముఖ కార్డియాలజిస్ట్ పేషంట్లతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. గతంలోనూ మరో కార్డియాలజీ ఆసుపత్రి నిర్వాహకులు ఉచిత పరీక్షలు చేస్తామని ప్రచారం చేయగా.. వందలాదిమంది ప్రజలు తరలివచ్చారు. కేవలం పదుల సంఖ్యలోని పేషంట్లకు మాత్రమే ఏర్పాటు చేయగా.. ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడే ఉండాల్సిన పరిస్థితులు కల్పించారు. దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదులు అందినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కొన్నాళ్ల కింద నారాయణపేట జిల్లా బోన్ పల్లికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు దేవమ్మ కిడ్నీ సమస్యతో మహబూబ్ నగర్ సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపై దాడి చేశారు. దాడిలో ఐఎంఏ పాలమూరు అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ పై దాడి జరగడం సంచలనమైంది. నిరసనగా జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు అత్యవసర సేవలను కూడా నిలిపివేసి బంద్ పాటించాయి.

ఇటీవల మహబూబ్ నగర్ (Mahabubnagar) టౌన్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటు లేక రోగి చికిత్స విషయంలో తలెత్తిన వివాదం వైద్య సిబ్బందిపై దాడికి దారితీసింది. మహమ్మద్ హనీఫ్, సోహైల్ అనే వ్యక్తులు సిబ్బందితో ఘర్షణకు దిగారని, దీనిపై ఆసుపత్రి వర్గాలు డాక్టర్ మహేష్ బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి దాడిని ఖండించాయి. వైద్య సిబ్బందే అమర్యాదగా ప్రవర్తించారని బాధితులు ఆరోపించారు.

పట్టణంలోని మరోఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, గద్వాల జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. గత సెప్టెంబర్‌లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు తర్వాత భవ్య (24) బాలింత మృతి చెందింది. రక్తస్రావమవుతున్నా సరైన వైద్య పర్యవేక్షణ లేకపోవడమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి లలిత అనే మహిళ మృతి చెందిన ఘటనలో, మానవ హక్కుల కమిషన్ (హెచ్ ఆర్ సి) బాధితులకు రూ. 8 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంఘటనలు ఉన్నాయి. గద్వాలలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర క్లినిక్ వంటి ప్రైవేట్ ఆసుపత్రులను అధికారులు సీజ్ చేశారు. గత మే నెలలో గద్వాల ప్రభుత్వాసుపత్రిలో పోలీసులకు, డాక్టర్లకు మధ్య మృతదేహం భద్రపరిచే విషయంలో ఘర్షణ నెలకొంది.

రోగి కండీషన్ చెప్పకపోవడంతోనే..

చాలా సందర్భాల్లో రోగి పరిస్థితి విషమించినప్పుడు కుటుంబ సభ్యులకు చెప్పకుండా వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ప్రధాన ఆరోపణ ఉంది. ఇదే చివరికి దాడులకు దారితీస్తుందని కొందరు డాక్టర్లే బహిరంగంగా చెబుతున్నారు. కొందరు డాక్టర్లు చికిత్స కంటే డబ్బులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, బిల్లు కడితేనే శవాన్ని ఇస్తామనే నిబంధనలు గొడవలకు కారణమవుతున్నాయి.

కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ కు సరిపడా పరికరాలు, నిపుణులైన వైద్యులు లేకపోవడంతో ప్రాణనష్టం జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంబులెన్స్‌లో ఆక్సిజన్ అయిపోయి రైతు మృతి చెందిన ఘటన ఇక్కడి వైద్య వ్యవస్థ నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ వైద్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. వైద్యశాఖ అధికారులు ఘటన జరిగినప్పుడే స్పందించడం కాకుండా, ఆసుపత్రులలో ప్రమాణాలు, ఫీజుల నియంత్రణ, రోగుల హక్కుల పరిరక్షణపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>