కలం, తెలంగాణ బ్యూరో: సెక్రటేరియెట్ క్యాంటీన్ (Secretariat Canteen) మళ్లీ ఉద్యోగుల చేతుల్లోకి రానుంది. 13 ఏండ్ల తర్వాత సెక్రటేరియెట్ స్టాఫ్ కో–ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నడవనుంది. ప్రస్తుతం కొడంగల్‌కు చెందిన కాంట్రాక్ట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో క్యాంటీన్ నడుస్తున్నది. అయితే సచివాలయ ఉద్యోగులకు అందే టిఫిన్, భోజనం నాణ్యత విషయంలో తరచూ ఫిర్యాదులు రావడం, వివాదాలు తలెత్తడం జరుగుతున్నది.
నాణ్యత లేకపోవడం, ఉద్యోగులకు సబ్సిడీ ఇవ్వకపోవడం, జవాబుదారీతనం లోపించడం.. ఇలాంటి ఫిర్యాదులు తరచూ వస్తున్నా పరిష్కారానికి మార్గం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో క్యాంటీన్‌ను మళ్లీ సెక్రటేరియెట్ స్టాఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నడిపించేందుకు రంగం సిద్ధమైంది.
ఈ నెలలోనే ఎన్నికలు
సొసైటీ ఆధ్వర్యంలోనే క్యాంటీన్‌ను నడపాలన్న సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్ మేరకు ఎన్నికలు జరిపేందుకు కసరత్తు మొదలైంది. సచివాలయంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు మూడున్నర వేల మందికి పైగా పని చేస్తున్నా.. వాళ్లంతా సొసైటీలో సభ్యులుగా లేరు. సభ్యులుగా ఉన్నవాళ్లంతా ఓటర్లు కారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు మొదలైన కసరత్తులో భాగంగా ఓటర్ల జాబితా ఫైనల్ చేసే ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం సొసైటీలో ఓటర్లుగా ఉన్నవారి పేర్లను అడ్‌హక్ కమిటీ ఆఫీస్ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేసింది.
ఈ నెల 10 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించింది. త్వరలో ఓటర్ల తుది జాబితా విడుదలవుతుంది. ఈ నెలాఖరు కల్లా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సొసైటీ లక్ష్యంగా పెట్టుకున్నది. కాగా, ప్రాథమిక వివరాల ప్రకారం సొసైటీలో సుమారు 960 మంది రెగ్యులర్ ఉద్యోగులు, మరో 600 మంది వరకు కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. సభ్యులంతా ఓటర్లు కాకపోవడంతో ఎంత మందికి ఓటు హక్కు లభిస్తుందన్నది డిప్యూటీ రిజిస్ట్రార్ ఫైనల్ చేసే లిస్టుపై ఆధారపడి ఉంది.
11 మంది డైరెక్టర్లు
ఓటర్లంతా కలిసి 11 మందిని డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు. ఆ డైరెక్టర్లు పరోక్ష పద్ధతితో సొసైటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ తదితరులతో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ ఎన్నికలు జరుగుతున్నాయి. సొసైటీ ఆధ్వర్యంలో నడిస్తే క్యాంటీన్ నిర్వహణ మెరుగుపడుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. గతంలో సొసైటీ ఆధ్వర్యంలో నడిచినప్పుడు ఫుడ్ క్వాలిటీ బాగున్నదని, ఉద్యోగులకు 35% సబ్సిడీ విధానం అమలైందని, లాభాల్లో నడిచేదన్న అభిప్రాయం ఉన్నది. సొసైటీ ఆధ్వర్యంలోనే క్యాంటీన్ నడవాలని గత ప్రభుత్వంలో ఉద్యోగులు మొత్తుకున్నా ఫలితం లేకపోయింది.
సభ్యుల షేర్లతో సొసైటీ నిర్వహణ
ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నవారు మెంబర్షిప్ పేరుతో సంవత్సరానికి రూ.100 చెల్లించాలి. ఒక్కో షేరు ధర రూ.100 చొప్పున కనీసంగా 5, గరిష్టంగా 20 షేర్ల వరకు సభ్యులు కొనుగోలు చేస్తారు. ఎన్ని షేర్లు ఉన్నా ఓటు మాత్రం ఒక్కటే. లాభాలు వస్తే షేర్ల సంఖ్యకు తగినట్లుగా సభ్యులకు పంపిణీ అవుతుంది. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థల ద్వారా నడుస్తున్న క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ సరిగా లేదన్న కారణంగా, ఎక్కువ ధరలు ఉన్నాయన్న అభిప్రాయంతో ఉద్యోగులు తినడం తగ్గించేశారు.
సచివాలయం వెలుపల ఒక క్యాంటీన్ ఉండగా, లోపల మరో రెండు పనిచేస్తున్నాయి. వీటికి తోడు ఇందిరా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో కేవలం స్నాక్స్, పిండివంటలు విక్రయించే స్టాల్స్ కూడా నడుస్తున్నాయి. ఇకపై క్యాంటీన్ నిర్వహణ ఉద్యోగుల సొసైటీ పరిధిలోకి వస్తే గతంలో ఉన్నట్లుగానే సబ్సిడీతో టీ, టిఫిన్ లాంటివి ఉద్యోగులకు అందే అవకాశముంటుంది.
13 ఏండ్ల తర్వాత
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల సొసైటీ ద్వారా నడిచిన క్యాంటీన్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లింది. క్యాంటీన్‌ను సొసైటీ ఆధ్వర్యంలోనే నడపాలని సెక్రటేరియెట్ ఎంప్లాయీస్ అప్పటి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొసైటీకి చివరిసారి ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో, ఇప్పుడు కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో ప్రైవేట్ ఏజెన్సీలే క్యాంటీన్ నిర్వహిస్తున్నాయి.

