దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై వివాదం చేలరేగిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎస్ఐఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ప్రక్రియతో పేద, దళిత, ముస్లిం, ఇతర వెనుకబడిన వర్గాల ఓట్లను తొలగిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే విపక్షాల ఆరోపణలను ఎన్నికల సంఘం లెక్క చేయడం లేదు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని సైలెంట్ రిగ్గింగ్‌గా అంటూ ఆమె అభివర్ణించారు.
Mamata Banerjee వాదన ఏమిటి?
ఎస్‌ఐఆర్ పేరుతో లక్షలాది నిజమైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి మాయం అవుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి.’ అని ఆరోపించారు. ఆమె దృష్టిలో ఈ సవరణ ఎన్నికలకు ముందే దళితులు, మైనార్టీలు వంటి వర్గాల ఓటు హక్కులను తగ్గించే ప్రయత్నం.
చట్టపరంగానే చేస్తున్నాం
ఇక ఎన్నికల సంఘం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ చట్టపరంగా నిర్ధారించబడిన సవరణ చర్య అని చెబుతోంది. అందులో ఎవరైనా పేరు తప్పిపోతే క్లెయిమ్ లేదా అభ్యంతరం దాఖలు చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. సవరణ పేరుతో భారీ సంఖ్యలో పేర్లను తొలగిస్తున్నారని వాటి వెనుక కారణాలు స్పష్టంగా వెల్లడించడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. “పారదర్శకత లేకపోవడమే అనుమానాలకు దారితీస్తోంది” అని విపక్షాలు అంటున్నాయి.
చట్టపరంగా ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితా సవరణ చేయడానికి పూర్తి అధికారం ఉందని నిపుణులు చెబుతున్నారు. రీప్రంజెటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950 ప్రకారం మరణించినవారి పేర్లు, డూప్లికేట్ ఎంట్రీలు లేదా నివాస మార్పు చేసినవారి వివరాలు తొలగించే హక్కు ఎన్నికల సంఘానికి ఉంది. కానీ, అందుకు ముందుగా డ్రాఫ్ట్ జాబితా ప్రచురణ, క్లెయిమ్స్–ఆబ్జెక్షన్స్ కాలం, ప్రజా ఆమోదం వంటి పద్ధతులను పాటించాల్సిందే.
ఎస్‌ఐఆర్ అమలులో తప్పులు జరిగితే దళిత, మైనార్టీ వర్గాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల సంఘం పూర్తిస్థాయి పారదర్శకతతో వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. ఇక పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రకటించింది. “ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వీధులకే వస్తాం” అని మమతా బెనర్జీ హెచ్చరించారు. ఎన్నికల సంఘం కేవలం బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వర్గాల ఓట్లను మాత్రమే ఉద్దేశ్యపూర్వకంగా తొలగిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దళితులు, మైనార్టీలు బీజేపీకి ఓట్లు వేయరు కాబట్టి వాళ్ల ఓట్లను తొలగిస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. మరి ఎస్ఐఆర్ పారదర్శకంగానే సాగుతోంది. మరణించిన వారి ఓట్లు తప్పుడు ఓట్లు మాత్రమే తొలగిస్తున్నారా? లేదంటే విపక్షాలు చెబుతున్నట్టు బీజేపీ వ్యతిరేకుల ఓట్లు మాత్రమే తొలగిస్తున్నారా? అన్నది వేచి చూడాలి.
Read Also: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం..
Follow Us On : Instagram

