తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) విధానంపై సమగ్ర సమీక్షకు కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల కాలంలో ప్రైవేట్ విద్యాసంస్థలు వ్యక్తం చేసిన అసంతృప్తి, నిరసనల మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంక్షేమశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, రచయిత కంచ ఐలయ్య, అలాగే ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల ప్రధాన కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, ఉన్నత విద్యాసంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులను సభ్యులుగా నియమించారు. ప్రభుత్వం గత నెల 28న జారీ చేసిన జీవో ప్రకారం, ఈ కమిటీకి మూడు నెలల వ్యవధి ఇచ్చింది. ఈ కాలంలో కమిటీ ప్రస్తుత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని సమగ్రంగా పరిశీలించి, దానిలో ఉన్న లోపాలు, ఆలస్యాలు, అమలులో ఎదురవుతున్న ఆర్థిక, పరిపాలనా సమస్యలను గుర్తించి, తగిన సవరణలు సూచించనుంది.
అదే విధంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రత్యేక ట్రస్ట్ ద్వారా నిర్వహించే అవకాశం ఉందా? అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించనుంది. ట్రస్ట్ ద్వారా నిధుల విడుదల మరింత పారదర్శకంగా, సమయానికి జరిగేలా చేయడం సాధ్యమా అనే అంశంపై నివేదిక ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ జీవోలో విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు సమర్పించిన సూచనలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇక గత కొన్నినెలలుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలలో ఆలస్యం జరుగుతోందని ఆరోపిస్తూ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాయి. కోట్ల రూపాయల బకాయిలతో అనేక కాలేజీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, విద్యార్థుల ప్రవేశాలపై కూడా ప్రభావం పడుతోందని వాటి యాజమాన్యాలు వెల్లడించాయి.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో విద్యాసంస్థల సంఘాలు ప్రెస్ మీట్లు, నిరసన కార్యక్రమాలు, అధికారులను కలవడం వంటి చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని తిరిగి సమీక్షించి, దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని గుర్తించింది. అధికారికంగా జీవోలో నిరసనల ప్రస్తావన లేకపోయినా, పరిపాలనా వర్గాల సమాచారం ప్రకారం, విద్యాసంస్థల నిరసనలు, బకాయిల సమస్యలు, విధానంలో ఉన్న సంక్లిష్టతలు ఈ నిర్ణయానికి దారితీశాయి. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కొత్త ఫీజు రీయింబర్స్‌మెంట్ పాలసీ రూపకల్పన చేసే అవకాశం ఉందని విద్యా వర్గాలు అంచనా వేస్తున్నాయి. విద్యార్థులు, విద్యాసంస్థలు రెండూ ఎదురుచూస్తున్న ఈ నివేదికతో రానున్న నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థలో మార్పులు, సంస్కరణలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ కమిటీకి చట్టబద్దత ఉందా?
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) అధ్యయన కమిటీకి చట్టబద్ధ హోదా లేదని తెలుస్తోంది. ఈ కమిటీని ప్రభుత్వం సాధారణ పరిపాలనా ఉత్తర్వు (జీవో) ద్వారా మాత్రమే ఏర్పాటు చేసింది. అంటే ఇది ఒక సలహా కమిటీగా మాత్రమే పనిచేస్తుంది, చట్టపరమైన అధికారం మాత్రం లేదు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కమిటీ బాధ్యత ప్రస్తుత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, సవరణలపై సూచనలు ఇవ్వడమే. కమిటీ సూచనలు తుది నిర్ణయం కావు. వాటిని పరిశీలించి, అమలు చేయాలా లేదా అనేది సంక్షేమశాఖ, విద్యాశాఖ మంత్రివర్గం నిర్ణయిస్తాయి. అయితే ఈ కమిటీ ఎటువంటి సిఫారసులు చేయబోతున్నది? అన్నది వేచి చూడాలి.
Read Also: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం..
Follow Us On : Instagram

