తెలుగు రాష్ట్రాలను రోడ్డు ప్రమాదాలు వీడటం లేదు. ఇటీవల రెండు అతి పెద్ద బస్సు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక(Karnataka)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బిదర్ జిల్లా హల్లిఖేడ్(Hallikhed) సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తీర్థయాత్రకు వెళ్లి..
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన ఐదుగురు భక్తులు కర్ణాటక(Karnataka)లో గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి పూజల కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు హల్లిఖేడ్ సమీపంలో ఎదురుగా వస్తున్న వ్యానును ఢీకొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) అనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
హల్లిఖేడ్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు అతి వేగంతో రావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు. తీర్థయాత్ర నలుగురు ప్రాణాలు తీసుకోవడంతో జగన్నాథ్ పూర్ గ్రామంలో విషాదం అలముకున్నది.
Read Also: ఎస్‌ఐఆర్ పేరుతో సైలెంట్ రిగ్గింగ్ – సీఎం మమతా
Follow Us On : Instagram

