Mobile Popup Ad
Mobile Popup Ad

రూ.లక్ష 20 వేల కోట్లు గోదావరి పాలు చేసిన బీఆర్ఎస్: TPCC చీఫ్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ హయంలో నీళ్ల దోపిడీ పేరిట రూ.లక్ష 20 వేల కోట్లు గోదావరి పాలు చేశారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి కూలిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ పేరుతో మంగళవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) కార్యవర్గ ప్రమాణ స్వీకారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మహేశ్ ముఖ్య అతిథిగా హాజరై డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీ చందర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అవకాశాలు అందరికీ రావు అని.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పదవికి వన్నె తేవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకి చేరువ చేయాలన్నారు. కుల సర్వే దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 53 శాతం సీట్లు బీసీలకు ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అబద్ధాలు ఆడడంలో కేటీఆర్ (KTR) కు నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఎద్దేవా చేశారు. న్యూయార్క్ కొలంబియా బిజినెస్ స్కూల్ లో కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని.. 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుందని ప్రగల్భాలు పలికారని అన్నారు. బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట అని విమర్శించారు. కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం అయ్యారని.. సంతోష్ రావు చాలా సంతోషంగా ఉన్నారని, కవిత వేరు కుంపటి పెట్టిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లో అక్రమంగా సంపాదించుకున్న వాటాలు పంచుకోలేని పరిస్థితి ఉందన్నారు. పదేళ్ల పాలనలో బీఆరఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా పేద ప్రజలను ఇబ్బందిపాలు చేసిందని దుయ్యబట్టారు. ప్రజాపాలన ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులివ్వడమే కాకుండా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టడమే మోదీ పని అని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు (Palamuru Rangareddy Project) జాతీయ హోదా ఇవ్వాలన్నదే తమ డిమాండ్‌ అని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని, ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వకుండా నిర్లక్ష్యం చూపుతోందన్నారు. ప్రాజెక్ట్ కు కేంద్రం నుంచి సరైన నిధులు, సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తోందన్నారు.

స్థానిక ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ సమాజిక న్యాయం చేసిందన్నారు. పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ సంకల్పమని తెలిపారు.

Read Also: కేర‌ళం, తెలంగాణ మ‌ధ్య కాదు.. యూడీఎఫ్‌, ఎల్డీఎఫ్ మధ్యే ఎన్నికలు: సీఎం రేవంత్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>