కలం, వెబ్ డెస్క్: ఎన్నికలు కేరళం, తెలంగాణ మధ్య కాదు అని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళంలో సీఎం పినరయి విజయన్ వైదొలిగే సమయం ఆసన్నమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేరళం రాష్ట్రంలోని కోవలం పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూడీఎఫ్ అభ్యర్థి విన్సెంట్ కు మద్దతుగా సీఎం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. పినరయి విజయన్ (Pinarayi Vijayan) హయాం ముగిసిందని.. 120 నెలల విజయన్ పాలన కాలం వైఫల్యానికి ప్రతీకగా నిలిచిందని విమర్శించారు. మూడింట రెండొంతుల మెజారిటీతో తాము గెలవబోతున్నామని.. ఊమెన్‌చాందీ తరహా పాలన అందిస్తామని స్పష్టం చేశారు. యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడంతో కేరళంలో వృద్ధులు, చిన్నపిల్లలే కనిపిస్తున్నారని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణలో మాదిరే అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ నియామకాలు, స్వీయ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం వంటివి కేరళంలోనూ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ విజయం సాధించిందని, దానిని మేం అభినందిస్తున్నామని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీలకే చెందుతుందన్నారు.
మా సవాళ్లకు విజయన్ సమాధానం ఇవ్వాలి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘పినరయి విజయన్‌తో పాటు కేరళం కమ్యూనిస్టు మహిళా నాయకులను నేను తెలంగాణకు ఆహ్వానిస్తున్నా. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు మేం చేస్తాం. తెలంగాణలోని ఏ మూలకైనా వెళ్లి మేం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలించవచ్చు. ఈ విషయంలో నేను విజయన్‌కు సవాల్ విసురుతున్నా. మేం 67 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ. 20,670 కోట్ల రుణమాఫీ చేశాం. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నాం. విజయన్ తెలంగాణకు వచ్చి అన్నీ పరిశీలించుకోవచ్చు. మేం ఏం చేస్తున్నామో అది చెబుతున్నాం.. మా సవాళ్లకు విజయన్ సమాధానం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.
Read Also: అసైన్డ్ భూములపై సర్కార్ కీలక నిర్ణయం.. రెవెన్యూ శాఖ రిపోర్ట్
Follow Us On : WhatsApp

