కలం, వెబ్ డెస్క్: మాదాపూర్ అంజయ్య నగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ప్రధాన నిందితుడు, బిల్డర్ సయ్యద్ సాజిద్ (Builder Syed Sajid)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న అతను.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కైన సాజిద్ మాదాపూర్ పరిధిలో నాసిరకం భవనాలను కడుతున్నాడు. అలా అంజయ్య నగర్‌లో అతి తక్కువ స్థలంలో ఏమాత్రం నాణ్యత లేకుండా కడుతున్న భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించారు. భవనం నిర్మిస్తున్న కాంట్రాక్టర్ ఖాజా కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు..
సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సృజన స్పష్టం చేశారు. రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉన్నా.. నిబంధనల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు. 70–75 గజాల్లోపు నిర్మాణాలకు అసలు పర్మిషన్లు ఉండవన్నారు. కార్పొరేషన్ పరిధిలో భూముల ధరలకు చాలా ఎక్కువగా ఉండటం వలనే, ఫిర్యాదులు కూడా ఎక్కువగా వస్తున్నట్లు వివరించారు. సాజిద్ నిర్మించిన ఇతర అక్రమ నిర్మాణాలను కూడా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.

