కలం, వెబ్‌డెస్క్: విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని లండన్ నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు విచక్షణ కోల్పోయి, రాష్ట్ర ప్రభుత్వం మీద, సీఎం అధికారిక పర్యటన మీద అవాస్తవాలు ప్రచారం చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అబద్ధపు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. బీజేపీ నాయకుల విషయంలో అసలు స్పందించాలని అనుకోవడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. రాజకీయ అంశాల జోలికి వెల్లకుండా ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన బాధ్యతల గురించి కేంద్రానికి తెలియజేయాలని అనుకుంటున్నట్ల తెలిపారు. తన పర్యటన కోసం ఇచ్చిన దరఖాస్తులో వివరాలు ఇవ్వలేదని, దాపరికంగా ఉందని బీజేపీ నేతలు మాట్లాడారన్నారు. ఈ సందర్భంగా సీఎంవో నుంచి చేసిన దరఖాస్తును మీడియా మందుంచారు.
ఇందులో స్పష్టంగా విద్య, క్రీడలు, తెలంగాణ పెట్టుబడులే ధ్యేయంగా తన పర్యటన సాగనుందని వెల్లడించానన్నారు. తన పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రానికి ముందే ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతోనే ఈ పర్యటన జరుగుతుందని చెప్పామన్నారు. అయినా ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతిచ్చి, అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదన్నారు. సీఎం పర్యటన దాపరికంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ మాట్లాడటం దారుణమన్నారు. ప్రధాని ఎన్నో దేశాలు పర్యటనలకు వెళ్లారని, అలాగే బీజేపీ నేతలు కూడా ఎన్నో విదేశీ పర్యటనలు చేశారని గుర్తు చేశారు. ఇంగ్లండ్‌కు అనుమతిచ్చి అమెరికాకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్ (CM Revanth Reddy) కేంద్రాన్ని నిలదీశారు.
బీజేపీ నేతలు గుజరాత్‌ను సమర్థించి మోదీ (Modi) చేతుల్లో కట్టుబానిసలుగా ఉండాలనుకుంటున్నారా? అని రేవంత్ ఫైర్ అయ్యారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు గుజరాత్‌కు మద్దతిస్తున్నారా? అని నిలదీశారు. తెలంగాణ సీఎం పర్యటనను అడ్డుకున్న కేంద్రం వైఖరిని లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు ఎండగడతారన్నారు. మొదటి నుంచి ప్రధాని మోదీ తెలంగాణపై వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
Also Read : 4 కోట్ల మందిని కేంద్రం అవమానించింది: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

