కలం, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రక్షక భటులే భక్షకులుగా మారిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన ఏఎస్ఐ (Macherla ASI) రమేశ్, తన పదవిని అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏకాంతంగా గడుపుతున్న ప్రేమికులే లక్ష్యంగా ఆయన తన వికృత చేష్టలకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జమ్మలమడకకు చెందిన ఒక ఆటో డ్రైవర్‌ను ఏజెంట్‌గా మార్చుకుని, రహస్యంగా ప్రేమికుల వీడియోలు తీయించడం రమేశ్ ప్రధాన వృత్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వీడియోలను అడ్డుపెట్టుకుని ఆ జంటలను బెదిరించడమే కాకుండా, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా కాకుండా, ఆ వీడియోలను చూపించి యువతులను, మహిళలను లోబరుచుకోవాలని చూస్తూ వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. ఈ వ్యవహారంలో ఏఎస్ఐ రమేశ్ (Macherla ASI Ramesh) తో పాటు స్థానిక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ కూడా ఇదే తరహాలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని సమాచారం. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతుండటంతో సామాన్య ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించింది.
Read Also: సర్కార్ వర్సెస్ ఆర్టిజన్స్.. సర్వీస్ రూల్స్ కోసం సమరం
Follow Us On: Instagram

