కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. అర్ధ రాత్రుళ్లు తనిఖీలు నిర్వహించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ అయ్యే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమన్వయ దాడుల్లో మొత్తం 450 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున సుమారు 1.45 గంటల సమయంలో సివిల్ సప్లై అధికారులు, పోలీస్ విభాగంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో భాగంగా ఇల్లెందు మండలం రేపల్లెవాడలోని కోట మైసమ్మ గుడి సమీపంలో అక్రమంగా వాహనాలలోకి ఎక్కిస్తున్న 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఒక లారీ, ఒక బొలెరో వాహనాలను కూడా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా టేకులపల్లి మండలంలో మరో ఘటనలో సుమారు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రయత్నంలో ఉన్న లారీని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి మళ్లించేందుకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ రెండు ఘటనలపై విచారణ కొనసాగుతోందని, నిందితులపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కంట్రోల్ ఆర్డర్ నిబంధనలు, భారతీయ న్యాయ సంహిత కింద కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని దారి మళ్లించడం అత్యంత తీవ్రమైన నేరమని, ఇందులో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతర తనిఖీలు, దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ దాడుల్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, సివిల్ సప్లై అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై సమాచారం అందించేందుకు ముందుకు రావాలని,స మాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా (Bhadradri Kothagudem) అదనపు కలెక్టర్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.
Read Also: సర్కార్ వర్సెస్ ఆర్టిజన్స్.. సర్వీస్ రూల్స్ కోసం సమరం
Follow Us On: X(Twitter)

