epaper
Tuesday, March 3, 2026
epaper

భద్రాచలం ఎల్ఐసీలో భారీ స్కాం.. బతికుండగానే చంపేసి కోట్లు కొట్టేశారు!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని భద్రాచలం ఎల్ఐసీలో సినీ ఫక్కీలో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పేదలు, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ అశ్వాపురం ప్రాంతానికి చెందిన కొందరు కేటుగాళ్లు ఏకంగా రూ. 1.52 కోట్లను కాజేశారు. బతికున్న వ్యక్తులను చనిపోయినట్లుగా చిత్రీకరించి, నకిలీ పత్రాలతో మోసం చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..

​అశ్వాపురం మండలానికి చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి, ఎల్ఐసీ (LIC) నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకున్నారు. ఎంపిక చేసిన వ్యక్తుల పేరిట పాలసీలు తీసుకుని, వారు చనిపోయారంటూ తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో, ఈ కేటుగాళ్లు కోటిన్నర రూపాయలకుపైగా సొమ్మును డ్రా చేసుకున్నారు.

ఖజానా ఖాళీ అయ్యాకా కూడా ఎల్ఐసీ నిర్వాహకులకు విషయం బోధపడలేదు. అంతర్గత తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడటంతో పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంత భారీ మొత్తంలో నగదు పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు గుర్తించలేకపోయారనేది ప్రశ్నగా మారింది.​ ​భద్రాచలం బ్రాంచ్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో పాలసీదారుల్లో ఆందోళన మొదలైంది. ​బ్రాంచ్ అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో స్కాం జరగడం సాధ్యమేనా?​ నకిలీ పత్రాలను వెరిఫై చేయడంలో సిబ్బంది ఎందుకు విఫలమయ్యారు? ​​అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన సంస్థలో ఇలాంటి ఘరానా మోసాలు చోటుచేసుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచైనా అధికారులు అప్రమత్తంగా ఉంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!